Posani krishna Murali: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళికి మరోసారి కోర్టులో షాక్ తగిలింది. బుధవారం పోసానిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సమయంలో ఆయన బోరున విలపించారు.తన ఆరోగ్యం బాగాలేదని, తన గుండెలో ఇప్పటికే రెండు సార్లు స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు.గొంతుకు కూడా చికిత్స చేస్తున్నారని చెప్పారు. తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు.
నంది అవార్డుల విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశానని, పార్టీ మారలేదనే కక్షతో లోకేశ్ తనపై ఈ కేసులు బనాయిస్తున్నారని.. తాను తప్పు చేశానని నిర్ధారిస్తే తనను నరికేయాలని ఎమోషనల్ అయ్యారు. తనకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదని న్యాయమూర్తి వద్ద పోసాని పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశారని జడ్జికి ఆయన వివరించారు.
ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోసాని కృష్ణమురళికి ఈనెల 26 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు కేసులో రిమాండ్ విధించారు. CID నమోదు చేసిన కేసులో రిమాండ్ విధించారు జడ్జి. సెక్షన్ 196, 353, w299, 336, 341(3) 61(A) కింద పోసానికి రిమాండ్ విధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసుల్లో దాదాపు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. అయితే బుధవారమే పోసాని రిలీజ్ అవుతారని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలంతా భావించారు. కానీ ఊహించని విధంగా గుంటూరు కోర్టు ఝలక్ ఇచ్చింది. అయితే బెయిల్‌పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్‌పై కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.