Saif Ali Khan: నా ఆటో ఎక్కింది సైఫ్ అని తెలీదు.. దాడి జరిగిన రోజు ఏం జరిగిందో చెప్పిన ఆటో డ్రైవర్

Bollywood Actor Saif Ali Khan

Attack on Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్‌ పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ముంబైలోని సైఫ్ నివాసంలోకి చొరబడిన అగంతకుడు అతన్ని కత్తితో తొమ్మిది సార్లు పొడిచి, పరారయ్యాడు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సైఫ్ అలి ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గుర్తుతెలియని ఆగంతకులు చాలా సులభంగా సైఫ్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇంట్లో దోపిడీకి ప్రయత్నిస్తుండగా సైఫ్ అడ్డగించాడని, దీంతో వారిలో ఒకరు సైఫ్‌ను కత్తితో పొడిచారని సమాచారం. ఈ దాడిలో గాయపడిన సైఫ్‌ను ఆటోలో హాస్పిటల్‌కు తరలించారు. సైఫ్‌ను ఆటోలో తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని లింకిన్ రోడ్ మీద ప్రయాణిస్తుండగా.. ఒక మహిళ పరుగెత్తుకుంటూ వస్తూ ఆటోను ఆపింది. ఆ తర్వాత ఆమె ఒక వ్యక్తిని, పిల్లాడిని ఆటో ఎక్కించింది. అయితే, నా ఆటోలో ఎక్కింది ఎవరో నాకు తెలీదు. తెల్ల దుస్తుల్లో ఉన్న అతడి శరీరమంతా రక్తపు మరకలతో నిండిపోయింది.

‘‘ఆటోను ఎక్కడికి తీసుకెళ్లాలి అని అడదిగినప్పుడు.. ఆయన లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించాడు. ఆ వెంటనే తాను నటుడు సైఫ్ అలీ ఖాన్ అని చెప్పాడు’’ అని ఆటో డ్రైవర్ పేర్కొన్నాడు. సైఫ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వెంటనే సిబ్బంది హుటాహుటిన చికిత్స అందించినట్లు తెలిపాడు. సర్జరీ తర్వాత సైఫ్ ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు ప్రకటించారు.

లీలావతి హాస్పిటల్ యొక్క COO డాక్టర్ నిరాజ్ ఉత్తమాణి మాట్లాడుతూ.. ‘‘సర్జరీ తర్వాత సైఫ్ ఆరోగ్యం నిలకగడగా ఉంది. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించాం’’ అని పేర్కొన్నారు. సైఫ్‌పై దాడి ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది. దొంగతనం కోసమే దుండగులు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డారా లేదా.. హత్య కోసం సుఫారీ తీసుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ సంఘటనపై అలి ఖాన్ భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ జరిగిన ఘటనపై ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఇంట్లో గత రాత్రి ఒక దొంగతనం ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో సైఫ్ అలి ఖాన్ చేతికి గాయమైందని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమేరాలో దొరికిన సాక్ష్యాల ఆధారంగా చేపట్టిన గాలింపుల్లో నిందితుడి ఆచూకీ తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తరవాత కథనం