Tollywood With Revanth: టాలీవుడ్ పెద్దలకు రెండు లక్ష్యాలు ఇచ్చిన రేవంత్‌- కమిటీ ఏర్పాటు చేసుకుంటామన్న దిల్‌రాజు

Revanth meeting with tollywood persons

హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని సినిమా పరిశ్రమ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అదే టైంలో తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విజన్‌తో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఈ రెండు లక్ష్యాల కోసం ఏం చేయాలో ఆలోచనలు పంచుకోవాలని రేవంత్ అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి నిర్దేశించిన రెండు లక్ష్యాల కోసం ఇండస్ట్రీ కచ్చితంగా ఆలోచన చేస్తుందని మీటింగ్ అనంతరం మాట్లాడిన ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు పేర్కొన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఇండస్ట్రీ పెద్దలు కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.దీనిపై మరో పదిహేను రోజుల్లో ఈ కమిటీ సమావేసమై సీఎం చెప్పిన అంశాలపై చర్చిస్తామన్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో దేశంలోని వివిధ భాషల సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హాలివుడ్ సినిమాల కూడా ఇక్కడ చిత్రీకరణ చేసుకునేందుకు ఏం చేయాలో సలహాలు సూచనలు చేయనుందీ కమిటీ. దీనికి ఎఫ్‌డీసీ సంధానకర్తగా ఉంటుందని దిల్‌రాజు వెల్లడించారు.

ప్రభుత్వం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇంతలా ఆలోచిస్తున్న టైంలో తాము కూడా సహాయం చేయడానికి సిద్ధమన్నారు దిల్‌రాజు. అందుకే సమాజానికి హితమైన డ్రగ్స్‌ నియంత్రణ లాంటి క్యాంపెయిన్‌లో పాల్గొంటామని తెలిపారు. దర్శకులు, నటులు ఇలా ఎవరైనా సరే చెబితే జనాలకు బాగా రీచ్ అవుతుందో వాళ్లు ఈ ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు.

ఈ మధ్య జరిగిన దురదృష్టకర ఘటనతో పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగిందని అందులో నిజం లేదన్నారు. అలాంటి అపోహలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు.

సంక్రాంతి సినిమాలు, బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్ల పెంపు అంశాన్ని మీడియా ప్రస్తావిస్తే అవి చిన్న అంశాలుగా చెప్పుకొచ్చారు. తమ భుజాలపై అంత కంటే పెద్ద బాధ్యతను ముఖ్యమంత్రి పెట్టారని దాని కోసమే ఆలోచిస్తామని అన్నారు. మిగతావి చాలా చిన్న విషయాలని సమయానుకూలంగా అవి పరిష్కారం అవుతాయని తెలిపారు.

సమావేశంలో ఎవరేం మాట్లాడారంటే…

ఇప్పటి వరకు అందరు సీఎంలు తెలుగు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందని కితాబు ఇచ్చారు. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్న ఆయన… తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని వాటిని ప్రోత్సహించాలని సూచించారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించారని ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ కండెక్ట్ చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నామన్నారు.

యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని నాగార్జున వెల్లడించారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరికగా చెప్పుకొచ్చారు.

రాజకీయ నాయకులకు ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందని మురళీమోహన్‌ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందన్న ఆయన సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇండస్ట్రీకి కష్టం రాకుండా చూసుకుంటారని ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి సురేష్‌బాబు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్‌గా చెప్పుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలన్నారు.

తరవాత కథనం