ఇప్పుడు ఎక్కడ చూసినా కోర్టు మూవీకి సంబంధించిన వీడియోలే. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ మూవీ సాంగ్స్, క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఆడియన్స్ ఈ చిత్రానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతున్నా రెస్పాన్స్ ఇంకా తగ్గలేదు.
మార్చ్ 14న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే థియేటర్లలో దూసుకుపోతోంది. నాచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేసాడు. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కి ఇప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండిస్తుంది.
ఒక చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఊహించని విధంగా ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే నే రూ.8 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అయింది. ఈ పది రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ప్రేక్షకుల నాడి పట్టేసిన ఈ చిత్రం 10 రోజుల్లో రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే ఓవర్సీస్ లోనూ కోర్టు మూవీ దుమ్ము దులిపేస్తోంది. అక్కడ $1 మిలియన్ మార్కును తాజాగా క్రాస్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో అర్థం చేసుకోవచ్చు.