కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతడిపై ఈడి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే అతడికి సంబంధించి దాదాపు పది కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడి జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. దీంతో అసలు కథ ఏంటి? శంకర్ చేసిన తప్పేంటి? ఈడి ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది? అని పలువురు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే
డైరెక్టర్ శంకర్ గతంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో సినిమా తీశాడు. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీ విని ఎరుగని రీతిలో అప్పట్లోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాకు రజనీకాంత్ యాక్టింగ్, ఐశ్వర్యరాయ్ అందం, శంకర్ టేకింగ్ మరో స్థాయి తీసుకెళ్లాయి. ఇక చిట్టి రోబో పాత్రలో రజనీకాంత్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇక సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. సాంగ్స్, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి.
అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా కథ తనదని అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి అన్నాడు. ఈ మేరకు 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ తన “జిగుబా” సినిమాను కాపీ కొట్టి రోబో సినిమా తీశాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా శంకర్ కాపీరైట్, ఐటిపి చట్టాలను ఉల్లంఘించారని ఆ పిటిషన్లో తెలిపాడు. దీంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నివేదిక కూడా అది నిజమే అని తెలిపింది. జిగుబా స్టోరీ కి రోబో సినిమాకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ఆ వివరాల ఆధారంగా కాపీ రైట్ చట్టంలోనీ సెక్షన్ 63 ని శంకర్ ఉల్లంఘించాడనీ ఈడి స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ కేసులో భాగంగానే ఈడీ తాజాగా శంకర్ ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది.