తెలంగాణ ప్రభుత్వం, టాలీవుడ్‌ మధ్య రాజీ!- ఎనుబోతుల పోరులో లేగదూడకు న్యాయం

Allu Arjun And Revanth reddy

Tollywood News: తెలంగాణ ప్రభుత్వం వర్సెస్‌ టాలీవుడ్‌. కొన్ని రోజులుగా ఏ సినిమా, వెబ్‌సిరీస్ ఇవ్వలేని కిక్ ఇచ్చింది. హైడ్రా పేరుతో నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేత నుంచి నేటి అల్లు అర్జున్ కేసు వరకు చాలా పరిణామాలు జరిగాయి. ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా రెండు వర్గాల మధ్య ప్రచ్చన్న యుద్ధమైతే నడిచింది. ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తైనా నేటికీ ఇంకా సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించ లేకపోతోంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నారు. ఇదే అసలు వివాదానికి కారణంగా కనిపించింది.

గత ప్రభుత్వంపై ప్రేమ

చాలా మంది సినీ ప్రముఖులకు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరి నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. మరికొందరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆ నాటి ప్రభుత్వం మరోసారి రావాలని ప్రత్యేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిన ప్రచారం చేసిన వాళ్లు ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అభిమానం కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇష్టం లేకపోవడం కావచ్చు. ఏదైనా కావచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చిన్న చూపు అయితే ఉంది.

ఆది నుంచి పట్టించుకోని పరిశ్రమ

తొలినాళ్లలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని శుభాకాంక్షలు చెప్పిన వాళ్లు కానీ, వచ్చి కలిసి సినిమా పరిశ్రమకు సంబంధించిన కష్టనష్టాలు చెప్పుకున్న వాళ్లు లేరు. అదే విషయాన్ని ఓ సందర్భంలో ఆయన వ్యక్తపరిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో సమావేశమయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డితో కూడా కొందరు సినీ పెద్దలు వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు.
దీంతో సినిమా ఇండస్ట్రీపై ఓ విధమైన నెగటివ్‌ అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉండిపోయింది. ఎంత మంచి చేసిన, ఎన్ని సినిమాలకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్‌షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చినా సినిమా పరిశ్రమ నుంచి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని టాక్ ఉంది. దీంతో అదును చూసి ప్రభుత్వం సినిమా పరిశ్రమపై దెబ్బలు వేస్తూనే ఉంది. అయినా సినిమా పరిశ్రమ అసలు విషయం తెలుసుకోలేదు.

డ్రగ్స్‌ కేసులతో హింట్

ముందు డ్రగ్స్‌ విషయంలో పాత కేసులు పునర్విచారణ చేయడంతో మొదలైంది. తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేతతో జోరు పెరిగింది. అనంతరం ఎన్టీఆర్ సినిమాకు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు క్యాన్సిల్ చేయడంతో మరో హింట్ ఇచ్చింది. అయినా సినిమా పరిశ్రమ లైట్ తీసుకుంది.
అప్పటి వరకు కాస్త సమయనంతో ఉన్న ప్రభుత్వం ఇగోను అల్లు అర్జున్ టచ్ చేశాడు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సీఎం పేరు మర్చిపోవడంతో ఒక ఎత్తు అయితే దాన్ని కేటీఆర్‌ ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం సెన్సేషనల్ అయ్యాయి. ఇంతలో పుష్ప-2 బెనిఫిట్‌షో రోజు జరిగిన ఘటన అవకాశంలా మారింది.

సంధ్య థియేటర్‌ ఘటనతో పట్టుపట్టిన ప్రభుత్వం

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఓ బాలుడు తీవ్ర అశ్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడం ప్రభుత్వానికి ఆగ్రహంతెప్పించింది. అనుమతి లేకుండా హీరోతోపాటు చిత్ర బృందం థియేటర్‌కు వెళ్లడంతోనే ఇదంతా జరిగిందని తేల్చిన ప్రభుత్వం థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్‌పై కేసులు పెట్టింది.

అల్లు అర్జున్ అరెస్టుతో పీక్స్‌కు వివాదం

వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ప్రధాన కారణం అల్లు అర్జునే నిర్దారించుకొని అరెస్టు చేసింది. వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైలుకు పంపించడం జరిగిపోయింది. బెయిల్ వచ్చినప్పటికీ ఒక రోజు పాటు అల్లు అర్జున్‌ను జైల్లో పెట్టింది. తర్వాత రోజు విడుదలైన అల్లు అర్జున్ హావభావాలు, వేసుకున్న టీషర్ట్‌, ఆయన్ని ఓదార్చేందుకు వచ్చిన సినిమా పెద్దలు కూడా వివాదాన్ని మరింత పెంచాయి.

అసెంబ్లీలో చీల్చి చెండాడిన రేవంత్

ఓ వైపు భార్యను పోగొట్టుకోవడమే బాధితుడు ప్రేమగా చూసుకున్న కుమారుడు చావుబతుల్లో ఉన్న కొడుకు ఆసుపత్రిలో ఉన్న బాధితుడిని పరామర్శించేందుకు మనసు రాలేదని ప్రభుత్వం మండిపడింది. అసలు అల్లు అర్జున్‌కు ఏమైనందని అంత మంది పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలోనే ప్రశ్నించారు. దీనికి కౌంటర్‌గా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌ పెట్టడంతో వివాదం మరో మలుపు తిరిగింది.

కిమ్స్‌ బాట పట్టిన టాలీవుడ్‌ 

ఒక్కసారి బాధితుడికి న్యాయం చేయకుండా అల్లుఅర్జున్‌ను ఎందుకు ఓదారుస్తున్నారని ప్రశ్నించడంతో అంతా కిమ్స్ బాట పట్టారు. సినిమా పరిశ్రమ నుంచి వేర్వేరుగా బాలుడిని పరామర్శించి ఎంత ఖర్చైనా పెట్టుకునేందుకు సిద్ధమని ధైర్యం చెప్పారు. ఇంతలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ ఎంట్రీతో శాంతి చర్చలకు మార్గం సుగమమైంది.

దిల్‌రాజు జోక్యంతో నేడు శాంతి చర్చలు

ఇవాళ(గురువారం, 26డిసెంబర్ 2024) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా పెద్దలు అల్లు అరవింద్, చిరంజీవి, దిల్ రాజు, వెంకటేష్, మరికొందరు నిర్మాతలు, దర్శకులు సమావేశం కానున్నారు. పరిశ్రమ ఏం కోరుకుంటోంది…. ప్రభుత్వం ఏం ఆశిస్తుందో చర్చించనున్నారు. ఈ చర్చలు విజయవంతమైంతే అల్లు అర్జున్ కేసు కూడా కొలిక్కి వస్తుందని ఇతర విషయాలపై క్లారిటీ ఉంటుందని అంటున్నారు.

ప్రభుత్వం చొరవతో రేవతి కుటుంబానికి కాస్త న్యాయం 

ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రభుత్వం మధ్య జరిగిన పోరులో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి కాస్త న్యాయం జరిగింది. ఒక వేళ విషయం ఇంత తీవ్రంగా లేకుంటే మాత్రం మొదట్లో ప్రకటించిన పాతిక లక్షలతో సరిపెట్టేసే వాళ్లు. విషయం సీరియస్ కావడంతో ఆ కుటుంబానికి సినిమా పరిశ్రమ నుంచి భారీగా సాయం అందింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన బాలుడు కళ్లుతెరుస్తున్నాడు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ నుంచి భారీగా సాయం అందింది.

రెండు కోట్లు ప్రకటించిన పుష్ప టీం

ఇప్పటి వరకు ఇచ్చిన సాయం పక్కన పెడితే చర్చలకు ఒక్కరోజు ముందు ప్రకటించిన సాయం రెండు కోట్లు చాలా కీలకం అని చెప్పవచ్చు. కిమ్స్‌లో తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్ బాధిత కుటుంబానికి రెండు కోట్ల సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్‌ తరఫున రూ.కోటి.. పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ కోటి రూపాయుల ఇస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్‌లను దిల్‌రాజుకు ఆయన అందజేశారు.

ఇప్పటికే రేవతి భర్త భాస్కర్‌కు ప్రభుత్వం నుంచి సాయం అందింది. కాంగ్రెస్ నేతలు పరామర్శించి కొంత సాయం చేశారు. మధ్య మధ్యలో సినీ ఇతర ప్రముఖులు పరామర్శించి డబ్బులు అందజేశారు. మంగళవారం దిల్‌రాజు మాట్లాడుతూ… భాస్కర్ అంగీకరిస్తే సినిమా పరిశ్రమలోనే ఆయనకు ఉద్యోగం ఇస్తామన్నారు. దురదృష్టకరమైన ఘటనలో చనిపోయిన రేవతిని తీసుకురాలేకపోయినా కుమారుడిని రక్షించగలిగారు వైద్యులు. కుటుంబ భవిష్యత్‌కు ధైర్యం ఇచ్చేలా వివిధ వర్గాల నుంచి సాయం అందింది.

తరవాత కథనం