‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనా మొత్తం తెలుగు ఇండస్ట్రీనే కుదిపేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించడం.. ఆ మూవీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్, విచారణ వంటి అంశాలన్నీ సినీ పరిశ్రమను ఆలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రంగంలోకి దిగారు. ఈ వివాదాస్పద అంశంపై పరిశ్రమ పెద్దలు సంయమనం పాటించాలని సూచించారు. ఎవరూ ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని, అలాగే సంధ్య థియేటర్ అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దని విష్ణు పేర్కొన్నారు.
టాలీవుడ్ పెద్దలు ఈ వివాదాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, తన సభ్యులకు ఈ విషయంలో మౌనంగా ఉండాలని సూచించారు. ఈ వివాదం పట్ల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదికాదు అని అన్నారు. ‘‘మనం ఈ వివాదంపై స్పందిస్తే.. అది పరిశ్రమకు మరింత నష్టం కలిగిస్తుందనే భయం ఉంది’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుని జైలుకు తరలించింది. ఒక రాత్రంతా బన్నీ జైల్లోనే ఉన్నాడు. మంగళవారం బన్నీ పోలీస్ స్టేషన్‌కు విచారణకు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు బన్నీని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అలాగే, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోలను సైతం పోలీసులు బన్నీకి చూపించారని, ఈ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వానికి గురయ్యాడని సమాచారం.
అయితే, ఇండస్ట్రీకి చెందిన సినీ పెద్దలు.. ప్రభుత్వం టాలీవుడ్‌పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా సినీ రంగంపై విమర్శలు గుప్పి్స్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సమాధానం ఇవ్వకుండా సంయంనం పాటించడం ఒక్కటే మంచిదని విష్ణు సూచించారు. గురువారం 10 గంటలకు ఇండస్ట్రీలోని పెద్దలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ కేసు గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే.. ఇటీవల సీఎం ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలపై చేసిన వ్యాఖ్యలు కూడా సినీ నిర్మాతలను దీర్ఘాలోచనలో పాడేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవల్సి రావచ్చనే ఆందోళన సినీ పెద్దలను వెంటాడుతోంది.