Mohan Babu: చిక్కుల్లో మోహన్ బాబు, జైలుకెళ్లే పరిస్థితి.. ఆడియో టేప్‌లో నోరుజారిన కలెక్షన్ కింగ్

Image Credit: Twitter

హౌస్ ఆఫ్ మంచూస్.. ఇది ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. గతంలో మంచు విష్ణు అనుచరులు తన సోదరుడు మనోజ్ ఇంటిపై దాడి చేసిన సమయంలోనిది. అప్పట్లో మంచు మనోజ్ రిలీజ్ చేసిన ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. దాన్ని కవర్ చెయ్యడం కోసం మంచు విష్ణు ఓ టీజర్ విడుదల చేశాడు. దానిపేరే హౌస్ ఆఫ్ మంచూస్. అయితే, అది కవరింగ్ వీడియో అని అప్పటికే నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. అలాగే దాన్ని నమ్మినవాళ్లు కూడా ఉన్నారు. కానీ, తాజా పరిస్థితులు చూసిన తర్వాత మంచు ఫ్యామిలీలో నిజంగానే గొడవలు ఉన్నాయని నిర్ధరించుకున్నారు. మనోజ్ పెళ్లి సమయంలోనే సీన్ ఏమిటో అర్థమైపోయింది. కానీ, ఈ స్థాయిలో గొడవలు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి వద్ద చోటుచేసుకున్న యుద్ధ వాతావరణాన్ని చూస్తే.. వాళ్ల మధ్య చన్నీళ్లు పోసినా పెట్రోల్‌లా మండిపోయేంతగా గొడవలు ఉన్నాయని అర్థమవుతోంది.

చిలికి చిలికి.. గాలివానలా మారిన గొడవ

ఇక అసలు విషయానికి వెళ్తే.. మోహన్ బాబు, మనోజ్ మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకున్న మంచు విష్ణు మంగళవారం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్ బౌన్సర్లను బలవంతంగా బయటకు గెంటించేశాడు. దీంతో మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకు ముందే మోహన్ బాబు పహాడీషరీఫ్ పోలీసులకు ఓ లేఖ పంపారు. అందులో సీనియర్ సిటీజన్ అయిన తనకు కొడుకు మంచు మనోజ్ నుంచి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో ఆయనకు రక్షణగా ఇంటికి కొంతమంది పోలీసులను పంపారు. అయితే, అప్పటికే విష్ణు తన బౌన్సర్లతో తండ్రికి భద్రత ఏర్పాటు చేశాడు. మనోజ్ కోసం వచ్చిన ఏ ఒక్కరినీ లోపల ఉంచకుండా బయటకు పంపేశాడు. మనోజ్ తన భార్య మౌనికాతో కలిసి డీజీపీని మోహన్ బాబు, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశాడు.

మనోజ్‌పై దాడి.. కొట్టింది ఎవరు?

మళ్లీ తిరిగి మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు. అయితే, అక్కడ సెక్యూరిటీ మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వలేదు. గేట్లు తెరవలేదు. తన బిడ్డ లోపల ఉంది తలుపు తియ్యండని చెప్పినా సరే వినలేదు. దీంతో మనోజ్ అనుచరులు బలవంతంగా గేటు తెరిచి లోపలకి ప్రవేశించారు. మనోజ్ లోపలికి వెళ్లిన వెంటనే విష్ణు బౌన్సర్లు అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే, అతడిని ఎవరు కొట్టారనేది తెలియరాలేదు. చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్.. గేట్లు తెరిచి మీడియా ప్రతినిధులను కూడా లోపలికి పంపారు. అక్కడ మనోజ్, మోహన్ బాబు మధ్య జరుగుతోన్న వాగ్వాదాన్ని మీడియా ప్రతినిధులు రికార్డు చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన మోహన్ బాబు మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చారు.

మీడియాపై మోహన్ బాబు దాడి

డిస్‌ప్లీన్‌కు చిరునామాగా పేర్కొనే మోహన్ బాబు సహనం కోల్పోయారు. అది కూడా మీడియాపై. మీడియా ప్రతినిధులకు నమస్కారం పెడుతూ.. టీవీ9 చానెల్ ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కున్నారు. రెప్పపాటు వేగంతో ఆ మైకుతో రిపోర్టర్ తలపై బలంగా కొట్టారు. ఆ దెబ్బకు అతడి తల తలపగిలింది. ఇప్పుడు అతడికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. తల వద్ద తీవ్రమైన గాయాలు అయ్యాయని, అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని వైద్యులు చెప్పినట్లు టీవీ 9లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంజీత్ మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు రాచకొండ సీపీ సైతం నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అలాగే మోహన్ బాబు, విష్ణుల లైసెన్డ్ గన్‌లను కూడా సీజ్ చేశారు. విలేకరిని కొట్టి గాయపరిచినందుకు మోహన్ బాబుపై చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి.

మనోజ్‌తో గొడవ అందుకేనా?

తాజాగా మోహన్ బాబు ఓ ఆడియో రిలీజ్ చేశారు. అందులో మనోజ్‌ తాగుడుకు బానిస అయ్యాడని, భార్య మాటలు విని తమతో గొడవ పడుతున్నాడని మోహన్ బాబు తెలిపారు. మనోజ్ తీరు వల్ల అతడి తల్లి కూడా హాస్పిటల్ పాలైందని పేర్కొన్నారు. గారంబంగా పెంచితే గుండెలపై తన్నాడని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ గురించి కూడా మాట్లాడారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులకు రాయితీల గురించి చెప్పారు. విద్యా సంస్థను నడపడం అంటే అంత సులభం కాదని, లెక్చర్లలకు జీతాలు తదితర ఖర్చులు చాలా ఉంటాయని చెప్పుకోచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే మనోజ్ పేద విద్యార్థులకు రాయితీ కల్పించాలనే అంశం మీద ఏమైనా ఒత్తిడి తెస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఈ గొడవకు దారి తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ఏమీ లేకపోతే మోహన్ బాబు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.

తరవాత కథనం