ఇండియాలో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని సంబందం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే.. నటీనటులు ఏదొక పార్టీకి మద్దతుగా నిలిచినవారే. అయితే కొందరు బయట పడితే.. మరికొందరు సైలెంట్‌గా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇక నటీ నటులు ముఖ్య మంత్రులుగా మారీ రాష్ట్రాలనే పాలించిన చరిత్ర మనది.
టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ చాలా మంది సినీ తారలు వివిధ రాజకీయ పార్టీల్లో చేరడం.. లేదంటే సొంత పార్టీలు పెట్టుకున్నవారు కూడా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సినీ తారలను రాజ్యసభ సహా ఇతర నామినేటెడ్ పోస్టులు కింద పదవులు ఇచ్చారు. అప్పటి నెహ్రూ నుంచి.. ఇప్పుడు మోడీ దాకా చాలా ప్రభుత్వాలు నటీవటులను రాజ్య సభకు పంపాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఎంపీలుగా కూడా ఉన్నారు.
తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. నటిగా, వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించుకుంది సొట్టబుగ్గల సుందరి. మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరెకెక్కిన దిల్ సేతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత సలాం నమస్తే (2005), కభీ అల్విదా నా కెహనా (2006) 2008లో కెనడా చిత్రం హెవెన్ ఆన్ ఎర్త్ సినిమాతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చిత్రంలో నటించారు ప్రీతీ. తెలుగులో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా (1998), మహేష్ బాబుతో కలసి రాజకుమారుడు వంటి పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందారు. ప్రీతి కేవలం నటి మాత్రమే కాదు సామాజిక సేవకురాలు కూడా. ప్రస్తుతం భారత్-పాక్ విభజన బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న లాహోర్ సినిమాలో ప్రీతి నటిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది ప్రీతి. ఈ సందర్భంగా ప్రీతీని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని, ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ.. చాలా రాజకీయ పార్టీ టిక్కెట్టు ఆఫర్ చేశారని చెప్పింది ప్రీతి. రాజ్యసభకు కూడా పంపిస్తారని ఆఫర్ ఇచ్చారని కానీ.. తాను అంగీకరించలేదని తెలిపింది.
రాజకీయాలు తనకు సరిపడవని ఉద్దేశ్యంతో పాటు ఇంట్రస్ట్ లేక అటువైపు వెళ్లలేదని పేర్కొంది. జవాన్ల కుటుంబంలో పుట్టావు కదా.. నువ్వు కూడా మా దృష్టిలోజవాన్ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. సోల్జర్ అని పిలవడం తప్పు కాదు.. తాను ఒక సైనికుడికి కుమార్తెను, ఒక సైనికుడికి సోదరిని కూడా.. తాము ఉత్తర భారతీయులం, బెంగాలీ అదీ ఇది కాదు.. తాము భారతీయులం.. దేశ భక్తి, జాతీయ గర్వం మా రక్తంలోనే ఉంటుందన్నారు ప్రీతి.
మీరు ఎదుర్కున్న కొన్ని విషయాల కారణంగా రాజకీయాల గురించి మీ అభిప్రాయం తీసుకున్నారా అని మరొక అభిమాని అడగగా, ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత విషపూరితంగా మారిందని ప్రీతి అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందంటే.. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని రాజకీయ రంగు పులుముతుందన్నారు. ప్రతీ కామెంట్‌ను రాజకీయాలతో ముడిపెడుతున్నారన్నారు. రాజకీయాలకు సంబంధం లేదని.. వాటిపై ఆశక్తిలేదని వెల్లడించారు ప్రీతి.