Allu Arjun Arrest: నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆయన్ని మధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని వైద్య పరీక్షలు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు పద్నాలు రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఓవైపు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్న టైంలోనే కేసులపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కేసులో క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.
పిటిషన్ విచారణ కొట్టేసిన తర్వాత కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం న్యాయవాదికి, అల్లు అర్జున్ న్యాయవాదికి మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఫిల్మ్ స్టార్ అయినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌స్టార్ అయినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఎక్కడా లేదని వాదించారు.
పీపీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. పర్సనల్ బాండ్ తీసుకొని అయన్ని విడుదల చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు రానున్నారు.
ఈ కేసులో అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి… అక్రమ అరెస్టుగా కోర్టుకు వివరించారు. సినిమా చూసేందుకు ఓ నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదని అందుకే 105 సెక్షన్ వర్తించదని కోర్టుకు తెలిపారు. అలాంటి కేసులో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం కూడా సరికాదన్నారు. కోర్టులో వాదనల సందర్భంగా 2017లో షారుఖ్ ఖాన్‌పై గుజరాత్‌లో నమోదు అయిన తొక్కిసలాట కేసును ఉదహరించారు. ఆ కేసులో ఆయనకు న్యాయస్థానం ఊరట కల్పించినట్టు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
సంచలనం కోసమే ఈ అరెస్టు పోలీసులు చేశారని వాదించారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నార సమాచారం పోలీసుల వద్ద ఉందని అందుకే అరెస్టు, రిమాండ్ రెండూ అక్రమమే అన్నారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారని ఇకపై కూడా సహకరిస్తారని అన్నారు. అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నిరంజన్ రెడ్డి వాదనలపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు సంచలనాల కోసం పని చేయరని… నేరతీవ్రతను బట్టి మాత్రమే రియాక్ట్ అవుతారని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో కింది కోర్టు రిమాండ్ విధించిందని హైకోర్టుకు తెలిపారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిలి వేసుకోవచ్చని సూచించారు.
రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు ఈసెక్షన్లు వర్తించవని తేల్చింది. అయితే మినహాయింపులు కూడా ఉండబోవన్నారు. నేరం పూర్తిగా అల్‌లు అర్జున్‌పై నెట్టేయలేమంది కోర్టు. అందుకే ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. కేసులో తీర్పు సందర్భంగా అరుణబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది.