Ranya Rao Gold Smuggling Case: గోల్డ్ స్మగ్లింగ్.. దేశంలో కొత్తేమీ కాదు! ఇండియాలోని ఎన్నో ఎయిర్‌పోర్టుల్లో.. ఏదో ఒక చోట విదేశాల నుంచి అక్రమ మార్గంలో బంగారం తీసుకొస్తూ పట్టుబడే స్మగ్లర్లు ఉంటూనే ఉంటారు. అయినా.. బంగారం అక్రమ రవాణా ఆగట్లేదు. ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడే వారి సంఖ్య తగ్గట్లేదు. ఇదే కోవలో.. కన్నడ నటి రన్యారావు బంగారం తరలిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె.. తరచుగా దుబాయ్ వెళ్లి అక్రమంగా బంగారం తీసుకొస్తుందని తెలుసుకున్న పోలీసులు.. పక్కాగా నిఘా వేసి మరీ పట్టేశారు.
14 కిలోల 800 గ్రాముల బంగారాన్ని తన దుస్తుల్లో దాచి తీసుకొస్తున్న రన్యాని.. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గత 15 రోజుల్లో రన్యా రావు 4 సార్లు దుబాయ్ వెళ్లింది. తరచుగా దుబాయ్ వెళ్లి వస్తుండటంతో.. డీఆర్ఐ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. రన్యా రావు దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 14.8 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ విలువ రూ.12 కోట్లు ఉంటుంది.
రన్యా రావు 15 బంగారం బిస్కెట్లని గమ్‌తో తొడలకు అతికించుకొని బెంగళూరుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో తనిఖీల సమయంలో ఆమె గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. స్కానర్లలో పట్టుబడకుండా ఉండేందుకు.. క్రేప్ బ్యాండేజ్‌ని అతికించుకున్నారు. రన్యా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో.. తనిఖీలు చేశారు. అమె పట్టుబడిన తర్వాత డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా.. తాను డీజీపీ కూతురినని రన్యా రావు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకుగానూ.. ఆమె పోలీసులకు ఫోన్ కాల్ చేసినట్లు తెలిపింది.
అసలు పోలీసు అధికారులతో రన్యాకు సంబంధమేంటి? ఆ స్మగ్లింగ్‌లో వారి ప్రమేయం ఏదైనా ఉందా? అన్న కోణంలోనూ డీఆర్ఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాదు.. గతంలోనూ.. రన్యా ఇలాగే అనేకసార్లు బంగారం అక్రమ రవాణాకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను గోల్డ్ స్మగ్లింగ్‌కి సంబంధించిన వ్యవహారాలపై విచారిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడంతో.. డీఆర్ఐ సిబ్బంది, పోలీసులు బెంగళూరులోని రన్యా ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ.. అక్రమంగా నిల్వ ఉంచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ.. కోట్లలో ఉంటుందని అంచనా వేశారు.
రన్యా రావు స్వస్థలం చిక్‌మగళూరు. ఆమె తండ్రి కర్ణాటక క్యాడర్‌కు చెందిన డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి. అయినప్పటికీ.. రన్యా రావు ఎందుకు గోల్డ్ స్మగ్లింగ్‌లోకి దిగిందనేది.. ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. దీని వెనుక పెద్ద తలకాయల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం.. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రన్యారావు సవతి తండ్రి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆయన్ని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది డీఆర్ఐ. అదేవిధంగా.. రన్యారావుకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపైనా దృష్టి పెట్టారు. గోల్డ్ స్మగ్లింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. మనీలాండరింగ్ కోణంలోనూ రన్యారావుని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. ఆవిడ ఇంట్లో జరిపిన సోదాల్లోనూ కోట్లు విలువ చేసే బంగారంతో పాటు కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. రన్యా రావు
వ్యవహారం ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
రన్యారావు దుబాయ్ నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. గతంలోనూ.. వారం రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. దాంతో.. ఆవిడ చేసే గోల్డ్ స్మగ్లింగ్ వెనుక పెద్దల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రతిసారీ.. తాను డీజీపీ కూతురినని చెబుతూ వ్యక్తిగత తనిఖీల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీతోనే ఇంటికెళ్లింది.
ప్రస్తుతం రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్‌కు.. ఆమె సవతి తండ్రి అయిన సీనియర్ ఐపీఎస్ అధికారికి కూడా ఏమైనా సంబంధం ఉందా? అనేది సంచలనం రేపుతోంది. ప్రధానంగా.. రన్యా రావు ఈ గోల్డ్ స్మగ్లింగ్ రూటుని ఎందుకు ఎంచుకుందనేదే బిగ్ సస్పెన్స్‌గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా చేతిలో.. ఆవిడేమైనా పావుగా మారారా? లేక.. డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారా? మరేదైనా కారణముందా? అనేది.. ఆసక్తి రేపుతోంది.
తాజాగా నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పరిచయం’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి తరుణ్ రాజ్ కొండూరు పరిచయం అయ్యారు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తరుణ్‌ని కింగ్‌పిన్‌గా అనుమానిస్తున్నారు.