టాలీవుడ్ ప్రముఖులతో జరిగిన సమావేశంలో రేవంత్ సర్కారు కీలక డిమాండ్‌లను వారి ముందు ఉంచింది. సినిమా ఇండస్ట్రీతో తమకు ఎలాంటి కయ్యాలు అవసరం లేదని తెలంగాణ అభివృద్ధిలో భాగమైతే చాలని పేర్కొంది. సంధ్య థియేటర్ ఘటనపై ఎందుకు అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో సినీ ప్రముఖులకు రేవతం వివరించారు.
తెలంగాణ అభివృద్దిలో సినిమా పరిశ్రమ భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్పష్టం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు చదివే బడుల అభివృద్ధి కోసం ప్రత్యేక సెస్ తీసుకొస్తున్నామని తెలిపారు. సినిమా పరిశ్రమ నుంచి దాన్ని వసూలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వాడుతున్నట్టు చెబుతున్నారు. నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో వీటిని నిర్మిస్తున్నామని అన్నారు.
అదే టైంలో తాను అసెంబ్లీలో ప్రకటించినట్టుగా ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌షోలు ఉండబోవని మరోసారి స్పష్టం చేశారు. అంతే కాకుండా టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కూడా ఇవ్వబోమని తేల్చేశారు. ఈ రెండు డిమాండ్‌లు తప్ప మిగతా వాటిపై చర్చించాలని ముందే వారికి స్పష్టం చేశారు.
సంధ్య థయేటర్‌లో ఏం జరిగిందో సినీ ప్రముఖులకు వీడియోలు వేసి చూపించారు. ఆ రోజు జరిగిన ఘటనలో మహిళ మృతి చెందడం ఓ ఫ్యామిలీ రోడ్డున పడిన విషయంపైనే తాము గట్టిగా యాక్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి వివరించారు. తమకు ఎవరిపై ఎలాంటి కోపాలు ద్వేషాలు లేవని స్పష్టం చేశారు.
సోషల్ కాజ్ ప్రకారం డ్రగ్స్ నియంత్రణకు సినిమా పరిశ్రమ తమ స్థాయిలో సహాయం చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. సినిమా నటులు చెబితే ప్రజల్లోకి మరింత వేగంగా చేరుకుంటుందని అందుకే దీనిపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని ఇండస్ట్రీకి సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేసే ప్రచార కార్యక్రమాల్లో కచ్చితంగా హీరోహీరోయిన్లు పాల్గొనాలని సీఎం సూచించారు.
కులగణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని దీని ప్రచారానికి సహకరించాలని సినిమా పరిశ్రమను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు తెలంగాణలో ఉన్న టూరిజం, టెంపుల్ టూరిజంపై కూడా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఇకపై సినిమా ఫంక్షన్స్‌ను సరైన అనుమతులతో నిర్వహించుకోవచ్చని రేవంత్ చెప్పారు. అయితే అక్కడ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మాత్రం సినిమా పరిశ్రమే తీసుకోవాలన్నారు. ముందస్తు అనుతులు లేకుండా ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించవద్దని అన్నారు. బౌన్సర్ల విషయంలో కూడా చాలా సీరియస్‌గా ఉంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం గంటన్నరపాటు సాగింది. ఈ సమావేశానికి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు హాజరయ్యారు.
నిర్మాతలు:- అల్లు అరవింద్, సురేష్ బాబు, కె.ఎల్.నారాయణ, దామోదర్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, చినబాబు, దానయ్య, కిరణ్, రవి, స్రవంతి రవి కిషోర్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, యూవీ వంశీ, సుధాకర్ రెడ్డి, నాగవంశీ, సునీల్ – అనుపమ, గోపీ ఆచంట, సి.కల్యాణ్, రమేశ్ ప్రసాద్, భరత్ భూషణ్
దర్శకులు: రాఘవేంద్రరావు, కొరటాల శివ, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, వీర శంకర్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు యెల్దండి, విజయేంద్రప్రసాద్
నటులు: నాగార్జున, వెంకటేశ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, కల్యాణ్ రామ్, శివ బాలాజీ, అడివి శేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్ పోతినేని
సినీ ప్రముఖుల భేటీకి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, రాష్ట్ర డీజీపీ కూడా పాల్గొన్నారు.