Manchu Manoj: మంచువారి ఇంట్లో గొడవలతో మీడియాకు మంచి స్టఫ్ దొరికింది. మంగళవారమైతే.. ఒక్కసారే డిజిటల్ మీడియా, టీవీ చానెళ్ల వ్యూస్ అమాంతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే.. మంచు మనోజ్ అంత హడావిడి చేశాడు మరి. అయితే.. ఈ వేడి ఉదయానికి తగ్గిపోయింది. అప్పటి వరకు ఆవేశంతో రగిలిపోయిన మంచు మనోజ్ కూడా తండ్రి హాస్పిటల్ పాలవ్వడం చూసి కరిగిపోయాడు. ఇదంతా చేస్తున్నది ఆస్తులు గురించి కాదని స్పష్టత ఇచ్చాడు. మరోవైపు మంచు విష్ణు కూడా మీడియా ముందు ఆచీతూచి మాట్లాడుతూ.. వివాదాలను ముదురకుండా చూసుకున్నాడు. విష్ణు తన తమ్ముడు.. మనోజ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి మరింత మసాలా ఇస్తాడని భావించిన కొన్ని మీడియా సంస్థలకు నిరాశే మిగిలింది.
ఇక ఉదయం నుంచి ఏం జరిగిందో చూస్తే.. రాత్రి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌కు గురైన మోహన్ బాబు అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందించారు. అయితే, ఆయన ప్రాణాలకేమీ ముప్పులేదని.. బీపీ పెరగడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డారని డాక్టర్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి జరిగిన రచ్చపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు ఇచ్చారు. రాచకొండ సీపీ ముందుకు హాజరు కావాలని వెల్లడించారు. ఇప్పటికే మంచు మనోజ్, విష్ణులు సీపీ ముందుకు హాజరయ్యారు. మళ్లీ ఎలాంటి గొడవలు చేయబోమని హామీ ఇచ్చారు. అలాగే రూ.1 లక్ష పూచీకత్తు కూడా చెల్లించినట్లు వెల్లడించారు. అయితే మోహన్ బాబు మాత్రం తాను సీనియర్ సిటీజన్ అని, పైగా అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉండటం వల్ల సీపీ ముందుకు హాజరు కాలేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆయన అభ్యర్థనను మన్నించింది.
మోహన్ బాబును పరామర్శించడానికి నిరాకరణ..
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మోహన్ బాబును చూసేందుకు మనోజ్ సిద్ధమయ్యాడు. అయితే, అక్కడ మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసి.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మనోజ్ మీడియా ముందుకు వచ్చి వాపోయాడు. తాను రాజీకి సిద్ధమేనని వెల్లడించాడు. విష్ణు కూడా ప్రెస్ మీట్‌లో మా కుటుంబ సమస్యలతో మీడియాకు సంబంధం ఏమిటని అడిగాడు. అంతేకాదు.. విలేకరిపై తన తండ్రి చేసిన దాడిని కూడా సమర్దించాడు విష్ణు. ‘‘నాన్న ఆవేశంలో అలా చేశారని.. మీ ఇంట్లోకి కూడా ఎవరైనా చొరబడితే చూస్తూ ఊరుకుంటారా?’’ అని ప్రశ్నించాడు. మీడియాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా తెలిపాడు.
అలాగే, మోహన్ బాబు దాడి, తిరుపతిలో బౌన్సర్ల దాడుల్లో గాయపడ్డ టీవీ9, సుమన్ టీవీ ప్రతినిధులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పాడు. చివరిగా.. మనోజ్, మౌనికల పెళ్లికి ఈ గొడవలకు ఎలాంటి సంబంధం లేదని విష్ణు స్పష్టత ఇచ్చాడు. 5.30 గంటల వరకు మనోజ్‌కు టైమ్ ఉందని, ఈ లోపు రాజీకి రావచ్చని విష్ణు చెప్పాడు. మరోవైపు మనోజ్ కూడా 5.30కు ప్రెస్ మీట్ పెడతానని చెప్పి.. చివరి క్షణంలో విరమించుకున్నాడు. దీంతో మంచు ఫ్యామిలీ నుంచి ఏ హాట్ న్యూస్ బయటకు రాకపోవడంతో మీడియా చిన్నబోయింది. తుఫాన్ వచ్చి వెలసిపోయినట్లుగా టీవీ, డిజిటల్ మీడియా బోసిపోయింది. ఈ రోజు కూడా గొడవలు పడతారని భావించిన కొన్ని మీడియా సంస్థలకు మంచు ఫ్యామిలీ నుంచి నిరాశే ఎదురైంది.
మరోవైపు మంచు లక్ష్మి సైతం.. ‘పీస్’ అంటూ తన కూతురు వీడియోతో ఒక సందేశాన్ని పంపించింది. దాన్ని మనోజ్ భార్య మౌనికా కూడా లైక్ చేసింది. ఇంకేముంది.. మంచు ఫ్యామిలీ కలిసిపోయింది. ఇంత హడావిడి చేసిన మీడియాకు ఏం లభించింది అని అనుకుంటున్నారా? బోలెడన్ని వ్యూస్.. టీఆర్పీ లభించాయి. బుధవారం కూడా వారి గొడవ కొనసాగి ఉంటే.. ఇంకా వ్యూస్ లభించేవి. కానీ, మధ్యాహ్నానికి ఆ వేడి చల్లారిపోయింది. ఎందుకంటే.. ‘మంచు’ ఫ్యామిలీ అక్కడ.