Sneezing: తుమ్మినప్పడు ముక్కు, నోరు మూసుకుంటున్నారా.. అదెంత ప్రమాదమో తెలుసా!

image credit: Pixabay

సాధారణంగా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు మూసుకుంటారు…లేదంటే ఆ సమయంలో బయటకు వచ్చే వైరస్ వ్యాప్తి చెంది ఆ చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎఫెక్ట్ అవుతారు. కానీ తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం కూడా ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే తుమ్ము ఆపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి గొంతులో తీవ్ర గాయమైందని స్కాట్‌లాండ్ కి చెందిన వైద్యులు చెప్పారు.

చిరిగిన శ్వాసనాళం

తుమ్ము వస్తోందని నోరు, ముక్కు మూసుకున్న ఆ వ్యక్తి గొంతులో భరించలేనంత నొప్పి వచ్చింది..వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు..ఆ కొద్దిసేపు నోరు,ముక్కు మూసుకోవడం వల్ల శ్వాసనాళం 2 మిల్లీమీటర్ల మేర చిరిగిపోయిందని చెప్పారు. తుమ్మిన సమయంలో ఆ వ్యక్తి డ్రైవింగ్ లో ఉన్నాడు. తనకి గతంలో అలర్జీలు, గొంతు సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. సమస్య గుర్తించిన వైద్యులు ఆరోగికి ఎలాంటి శస్త్ర చికిత్సలు అవసరం లేదని కాసేపు పరిశీలనలో ఉంచారు. అనంతరం అనాల్జెసిక్, యాంటీహిస్టామైన్ మందులు ఇచ్చి డిశ్శార్జి చేశారు. 15 రోజుల పాటూ శారీరక శ్రమకు దూరంగా ఉండాలని సూచించారు. ఐదువారాల తర్వాత ఆ గాయం నయం అయినట్టు స్కానింగ్ ద్వారా గుర్తించారు. సాధారణంగా తుమ్ములు వచ్చేటప్పుడు నోరు-ముక్కు మూసుకుంటే శ్వాసనాళం పైభాగంపై ఒత్తిడి పడుతుంది. ఈ కేసును మెడికల్ జర్నల్ బీఎంజే కేస్ రిపోర్ట్స్‌లో నమోదు చేశారు. ముక్కులో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపేటప్పుడు తుమ్ములు వస్తాయి..వాటిని అడ్డుకోరాదని వైద్యులు చెప్పారు.

తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవద్దా!

తుమ్మినప్పుడు నోరు ముక్కు మూసుకుంటే ప్రమాదం అన్నారని..చేతులు అడ్డుపెట్టుకోకుండా తుమ్మేయవచ్చా అనే సందేహం వచ్చి ఉంటుంది. అయితే తుమ్మినప్పుడు లాలాజలం, శ్లేష్మం, వైరస్‌లు ఎదుటి వ్యక్తుల మీద పడకుండా..వారి వరకూ చేరకుండా సున్నితంగా నోటికి, ముక్కుకి చేతులు అడ్డుపెట్టుకోండి. తుమ్ము వచ్చనప్పుడు పై పెదవిని బొటనవేలితో కొన్ని సెకెన్లు నొక్కిపెట్టినా చాలు..గొంతులోపల ఎలాంటి గాయం కాదన్నారు.

తుమ్ము ఆపుకోరాదు

అందరి మధ్యా ఉన్నాం తుమ్మితే ఏమైనా అనుకుంటారేమో అని ఆపేసుకుంటారు కొందరు. అది కూడా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. తుమ్మినప్పుడు ముక్కు నుంచి శ్లేష్మపు చుక్కలు వేగంగా బయటపడతాయి..ఇది శ్వాసకోస వ్యవస్థపై పడే ఒత్తిడి వల్ల శక్తివంతమైన చర్యగా మారుతుంది. తుమ్మితే పక్కెటెముకల్లో నొప్పి వస్తోంది అనుకుంటారు కానీ…ఆపితేనే పక్కటెముకలు గాయపడే ప్రమాదం ఉంది. ఇంకా తుమ్మును బలవంతంగా ఆపుకుంటే డయాఫ్రాగమ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది…కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. తుమ్మును ఆపేసుకుంటే రక్తనాళాల గోడలో ఉద్భవించే బెలూనింగ్​ కు కారణమవుతుంది. ఇది మెదడు చీలికకు దారితీసే ఒత్తిడికి కారణమై రక్తస్రావం జరుగుతుంది. తుమ్మును ఆపేసుకుంటే గొంతు వెనుక భాగంపై కూడా ఒత్తిడి పడుతుంది. ఒక్కోసారి ఆ భాగం పగిలి వాపు వస్తుంది. అందుకే వీలైనంతవరకూ తుమ్ము ఆపేసుకోవద్దు. తుమ్ములకు కారణమయ్యే అలర్జీల నుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు అనుసరించండి.

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం , నిపుణులు పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ వార్తను పోస్ట్ చేశాం. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుల సలహాలు పాటించాల్సిందిగా మా మనవి.

తరవాత కథనం