Anti-Aging Foods: యవ్వనంగా కనిపించే చర్మం కోసం.. బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!

Anti-Aging Foods

Anti-Aging Foods: చర్మం ఆరోగ్యంగా, అందంగా, కాంతివంతంగా మెరవాలంట సరైన సరైన పోషకాహారం తీసుకోవాల్సిందే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై మృదుత్వం కోల్పోయి ముడతలుపడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టాలంటే.. కొల్లాజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొల్లాజెన్ అనేది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. కొల్లాజెన్ స్థాయిని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

సాధారణంగా మటన్ ఎముకల్లో కొల్లాజన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సూప్స్ లేదా కూర రూపంలో తీసుకోవచ్చు. ఇది తినడం వల్ల చర్మానికి తేమను అందించి, దృఢంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే ఖనిజాలు, ప్రోటీన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ కొంత మోతాదులో బోన్ సూప్ తీసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి చర్మ సౌందర్యానికి చక్కగా పనిచేస్తాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి. ఇవి ప్రతి రోజూ తింటే చర్మానికి తగినంత పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

బ్రోకోలీలో విటమిన్ C, విటమిన్, కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అధ్బుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచి వృద్యాప్య సమస్యల నుంటి కాపాడతాయి. దీన్ని సలాడ్‌గా, కూరగా తీసుకోవచ్చు.

ఉసిరికాయ చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఉండే విటమిన్ C శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఉసిరికాయ రసం తాగడం లేదా పచ్చడిగా తీసుకోవడం వల్ల చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది.

సిట్రస్ పండ్లలో ముఖ్యమైనదైన ఆరెంజ్‌.. ఇది కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ C సమృద్ధిగా దొరుకుతుంది. ఇది శరీరానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒక ఆరెంజ్ తినడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా, అందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డులోని ప్రోటీన్, అమైనో యాసిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డు తెల్లసొనను తినడంతో పాటు ముఖానికి ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని దృఢంగా ఉండేలా చేస్తాయి.

బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు వంటి సీడ్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా.. ఆరోగ్యంగా ఉంచడంలో తొడ్పడతాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వయసు పెరిగినా కూడా చర్మం తాజాగా, మృదువుగా, యవ్వనంగా కనిపిస్తారు.

తరవాత కథనం