వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండ తీవ్రత వల్ల వచ్చే గాలి ప్రజలను తీవ్ర నీరసానికి గురిచేస్తుంది. దాహం దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతటి వేడిలో ఉక్క పోత మధ్య నలిగిపోతున్నారు. ఆ సమయంలో చల్ల చల్లని నీరు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అందువల్లే చాలామంది వేసవికాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. ఎండవేడికి చల్ల చల్లని కూలింగ్ వాటర్ తాగితే ఆ కిక్కే వేరు అన్నట్లు ఫీల్ అవుతారు. కానీ ఇలా తాగడం వల్ల ఆ సమయానికి హాయిగా ఉన్నా.. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కండరాల తిమ్మిరి
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దీంతో నార్మల్ వాటర్ కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టిన కూలింగ్ వాటర్ తాగుతారు. దీని కారణంగా తలనొప్పి, అలసట, కండరాల తిమ్మిరి, మూత్రం రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్రిడ్జ్ వాటర్ కంటే మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిదని సూచిస్తున్నారు.
జీర్ణవ్యవస్థకు హాని
వేసవికాలంలో చల్ల చల్లని కూలింగ్ వాటర్ తాగితే జీర్ణశయం పనితీరు మందగిస్తుందని అంటున్నారు. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదని చెబుతున్నారు. దీంతో కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి, సహా మరెన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇవి మాత్రమే కాకుండా గొంతు నొప్పి, ముక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు. ఎండలో నుంచి వచ్చిన తర్వాత కూలింగ్ వాటర్ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోయి జలుబు, గొంతు మంట లాంటివి గమనించవచ్చు. అందువల్ల నార్మల్ వాటర్ తాగితే మంచిదని అంటున్నారు.