ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కరవుతున్నారు. మండే ఎండలు.. వేడి గాలులు శరీరాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ ఎండ దెబ్బకి దొరికిన వారు వడదెబ్బకు గురవడం ఖాయం అని చెప్పాలి. వడదెబ్బ చాలామందిలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ దాన్ని లైట్ గా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వడదెబ్బ తగిలే వ్యక్తుల పరిస్థితి తీవ్రంగా మారుతుంది. దీనివల్ల అలసట, తీవ్ర జ్వరం, మైకం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైన వారు సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందువలన వడదెబ్బ లక్షణాలను ముందుగా గుర్తించి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు దాని లక్షణాలు తెలుసుకుందాం.
హై ఫీవర్
వడదెబ్బకు గురైన వారిలో కనిపించే మొదటి ముఖ్యమైన లక్షణం అధిక జ్వరం. ఎవరైనా వడదెబ్బకు గురైనప్పుడు వారి శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. వేసవిలో వైరల్ ఫీవర్ లేకపోయినా.. ఉష్ణోగ్రత పెరగడం వల్ల అది వడదెబ్బకు సంకేతం అయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ కారణంగా శరీరం నుంచి చెమట రావడం ఆగిపోయి బాడీ హీటెక్కిపోయి పొడిగా మారుతుంది.
మైకం
వడదెబ్బ తగిలిన వ్యక్తికి మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. అది ఒక్కోసారి మూర్చకు కారణం అవుతుంది. వడదెబ్బ తగలడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీని కారణంగా శరీరంలో గ్లూకోస్ స్థాయిలు పడిపోతాయి. అదే సమయంలో బాడీ బలహీనతకు గురవుతుంది. అలాగే రక్తపోటు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది.
తలనొప్పి
వేసవికాలంలో మండే ఎండలు నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా అధిక తీవ్రమైన తలనొప్పి వస్తుంది. దీనివల్ల మనిషి గందరగోళానికి గురవుతాడు. వడదెబ్బకు గురైన వ్యక్తి ప్రవర్తనలో కొన్ని మార్పులను గుర్తించి చూడవచ్చు.
వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దీని కారణంగా హార్ట్ బీట్ వేగంగా మారిపోతుంది. శ్వాస కూడా స్పీడ్ అవుతుంది. ఒకవేళ హార్ట్ పేషెంట్ అయితే.. హాట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వడదెబ్బ తగిలింది అని అర్థం చేసుకొని సమీప వైద్యుడిని సంప్రదించాలి.