Summer Skincare Tips: సమ్మర్ లో ఈ టిప్స్ ఫాలో అయితే..చెక్కు చెదరని అందం మీ సొంతం

Summer Skincare Tips

Summer Skincare Tips: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే.. ప్రజలు జంకు తింటున్నారు. ఇక ఈ సమ్మర్‌లో ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చర్మం జిడ్డుగా మారిపోవడం, నల్లగా అవడం ముఖంపై మచ్చలు, మొటిమలు, ముఖం పొడిబారిపోవడం, కమిలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మగువలు తమ అందాన్ని రక్షించుకోవడం కోసం బయట మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే వేసవి బ్యూటీ రోటీన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడితే చెక్కు చెదరని అందం సొంతం చేసుకోవచ్చు. సమ్మర్‌లో సౌందర్య సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం..
ఈ సీజన్ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. మృత కణాలు కారణంగా చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఉవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి.. చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.  అందుకే చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. స్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో కానీ, ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి, మీ చర్మ తత్వానికి సరిపోయే న్యాచురల్‌ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్‌ చేయండి. కనీసం వారంలో రెండు మాడు సార్లు అయినా ఇలా చేస్తే.. చర్మం మృత కణాలు తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది.

మాయిశ్చరైజర్ మార్చండి
వేసవికాలంతో పోలిస్తే.. చలికాలంలో చర్మం పొడిబారిపోయి ఉంటుంది. ఆ సీజన్‌లో వాడే మాయిశ్చరైజర్ కాస్త ఆయిలీగా, హెవీగా కనిపిస్తుంది. అటువంటి మాయిశ్చరైజర్ వాడకూడదు. డాక్టర్ల సలహా తీసుకుని ఈ సీజన్‌కి సరిపడ క్రీము వాడాలి.

సన్‌స్క్రీన్‌ మర్చిపోవద్దు..
సమ్మర్‌లో స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో ఏది మర్చిపోయినా.. మీ చర్మానికి సన్‌స్క్రీన్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడూ కూడా సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడమే కాదు, స్కిన్‌ను తేమగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఆహారంపై దృష్టి పెట్టండి..
మనం తీసుకునే ఆహారం కూడా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే వేసవి కాలంలోనూ చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉండేలా చేసేందుకు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే.. మామిడి, బెర్రీస్.. వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

నీళ్లు ఎక్కువగా తాగండి…
అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీని కారణంగా, డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. చర్మం నిర్జీవంగా మారుతుంది కూడా. చర్మం కాంతివంతంగా , మెరిసిపోవాలంటే.. ఈ కాలంలో సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. జ్యూస్‌లు, సూప్‌లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవచ్చు.

బయటకు వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

బయటకు వెళ్లినప్పుడు.. ఎండ తగలకుండా యూవీ కిరణాలు నుండి రక్షించుకునేందుకు.. కూల్‌ గ్లాసెస్‌, గొడుగు కచ్చితంగా తీసుకెళ్లండి. వీలైనంత వరకు ఎండ తగలకుండా ముఖం, తలపై స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

 

 

 

 

తరవాత కథనం