ఫస్ట్ నైట్ to అంత్యక్రియలు..ప్రతి ఒక్కరు జీవితంలో ఈ 16 ఘట్టాలు దాటాల్సిందే!

Shodasa Samskaralu: హిందూ ధర్మంలో ఎన్నో విశ్వాసాలు పాటిస్తారు. అయితే ఎవరెన్ని అనుసరించినా కానీ.. ప్రతి మనిషి తన జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకూ మొత్తం 16 సంస్కారాలను తప్పనిసరిగా అనుసరిస్తారు. వాటినే షోడస సంస్కారాలు అంటారు.

ఫస్ట్ నైట్

షోడస సంస్కారాల్లో మొదటిది ఫస్ట్ నైట్.. వైదిక భాషలో దీనినే గర్భాదానం అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఓ కొత్త ప్రాణానికి జీవం పోయడమే ఈ సంస్కారం ముఖ్యోద్దేశం. వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనల, ఆరోగ్యకరంగా ఉండి గర్భాన్ని దాల్చినప్పుడు తెలివైన బిడ్డకు జన్మనిస్తుంది.

పుంసవనం

ప్రతి ఇంటికి వారసుడు ఉండాలి అనే ఆలోచన చాలామందికి ఉంది..ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందా అని సాగదీసే వారూ ఉన్నారు. మగ పిల్లాడు ఉండాల్సిందే అని పట్టుబట్టేవారూ ఉన్నారు. అందుకే గర్భం దాల్చిన తర్వాత పుంసవనం అనే పూజ చేయించేవారు. ఈ క్రతువు ఫాలో అయితే మగపిల్లడు పుడతాడని విశ్వసిస్తారు. అయితే పుంసమనం చేయించిన తర్వాత కూడా ఆడబిడ్డలు పుట్టిన సందర్భాలున్నాయి..

సీమంతం

షోడస సంస్కారాల్లో సీమంతం ఒకటి. కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచి గుణగణాలు రావాలని, మంచి స్వభావం ఉండాలని , ఆరోగ్యకరంగా భూమ్మీదకు అడుగుపెట్టాలని ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకుంటారు. చేతుల నిండుగా వేసే గాజులు కూడా సుఖ ప్రసవం, ఆరోగ్యం కోసమే..

జాతకకర్మ

బిడ్డ భూమ్మీదకు వచ్చిన సమయంలో ఏవైనా దోషాలుంటే తొలగించేందుకు చేసే క్రతువు ఇది. చిన్నారికి బంగారు స్పూన్ తో తేనె, నెయ్యి నోటికి అద్దుతారు. నెయ్యి ఆయుష్షును పొడిగిస్తుంది.. తేనె కడుపులో ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది.

నామకరణం

నామకరణ మహోత్సవం అంటే అందరూ అనుసరిస్తున్నదే. పేరు నిర్ణయించి అందరి ముందు ప్రకటిస్తారు.

ఇల్లు దాటించడం

బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఇల్లు దాటించేటప్పుడు మంచి రోజు చూసుకుంటారు. ఫస్ట్ టైమ్ ఆలయానికి తీసుకెళ్లి ఆ తర్వాత ఎవరి ఇంటికైనా వెళతారు.

అన్నప్రాశన

చిన్నారి పెరిగి నెలలు గడిచిన తర్వాత ఆకలి తీర్చేందుకు ద్రవాహారం నుంచి ఘనాహారం ఇవ్వడం ప్రారంభిస్తారు. చిన్నారికి మొదటిసారి ఘనాహారం అందించే క్రతువు అన్నప్రాశన

కేశ ఖండన

పుట్టుజుట్టు తీయించాలి అంటుంటారు కదా అదే కేశ ఖండనం. దీనికి కూడా ముహూర్తం చూస్తారు. మంచి రోజుచూసి కేశాలను భగవంతుడికి అర్పిస్తే దీర్ఘాయుష్షు సిద్ధిస్తుందని పండితులు చెబుతారు.

చెవులు కుట్టించడం

షోడస సంస్కారాల్లో మరొకటి చెవులు కుట్టించడం. చిన్నారి ఆరోగ్యానికి చెవులు కుట్టించడం చాలా అవసరం. పూర్వకాలం మగపిల్లలకు కూడా కుట్టించేవారు.

అక్షరాభ్యాసం ఉపనయనం

చిన్నారి మానసికంగా పరిపక్వత చెందిన తర్వాత కొత్త విషయాలు నేర్పించేందుకు, సమాజంలో అందరితో మమేకం అయ్యేందుకు అక్షరాభ్యాసం చేయించి పాఠశాలకు పంపిస్తారు. అప్పట్లో ఈ క్రతును ఏడేళ్లకు చేసేవారు. వేదం నేర్చుకునేందుకు వెళ్లేవారికి ఏడేళ్లకు ఉపనయనం చేయించి వేదవిద్యకోసం గురువుల వద్దకు పంపించేవారు.

కేశాంత

మగపిల్లలు పెద్దవుతున్నారు అనేందుకు గుర్తుగా గడ్డం కనిపించే సమయం పదహారేళ్లు. మొదటిసారి గడ్డం గీసుకునేందుకు కూడా మంచి రోజు చూస్తారని మీకు తెలుసా. షోడస సంస్కారాల్లో కేశాంత కూడా ఓ క్రతవు.

సమావర్తన

విద్యాభ్యాసం పూర్తైన తర్వాత పాఠశాలను వదిలి వెళ్లినప్పుడు నిర్వహించే సంస్కారాన్ని సమావర్తన అంటారు. అంటే విధుల్లో చేరడం, బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు సూచన అది.

సమకాలీన సంస్కృతి

విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఉద్యోగం చేస్తూ గృహస్థ జీవనం గడుపుతారా? అన్ని బంధాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతారా? అనేది నిర్ణయించుకోవడమే సమకాలిన సంస్కృతి. ఏ మార్గం అనుసరించాలన్నా మీకు విద్య నేర్పించిన గురువు అనుమతి తప్పనిసరి.

వివాహ వేడుక

విద్య పూర్తిచేసి విధుల్లో చేరిన తర్వాత వరుడికి తగిన వధువును చూసి వివాహం చేస్తారు. వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఆఖరి శ్వాసవరకూ తనతోనే కలసి బతుకుతానని మాటిస్తాడు.

వివాహ అగ్ని ఆచారాలు

పెళ్లై వచ్చిన తర్వాత ఇంట్లో తొలిసారి వంట చేసేందుకు నిర్వహించే క్రతువు ఇది. పాలు పొంగించడం అంటారు కదా ఇదే. ఆ రోజు నుంచి ఇంటి వెలుగుకి తన భార్య ప్రధాన కారణం అవుతుందని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి పూజచేస్తారు.

అంత్యక్రియలు

ప్రతి మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యక్రియలు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని నిర్వహించే కార్యక్రమం ఇది. వేద మంత్రాల మధ్య తల్లిదండ్రులకు కొరివి పెడతాడు కుమారుడు. 13 రోజులు కర్మకాండ అయిన తర్వాత సంతర్పణ నిర్వహించడంతో అంత్యక్రియల క్రతువు పూర్తవుతుంది.

Note: పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..

తరవాత కథనం