ఉల్లి పాయలు లేని కూర రుచే ఉండదు. అంత ఎందుకు.. అసలు ఉల్లి లేనిదే కూరలే ఉండవు. అంతగా మనం ఉల్లిపాయలకు అలవాటు పడిపోయాం మరి. అయితే, ఈ అలవాటు మంచిదే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు చెప్పినట్లుగా మనకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఉల్లిలో విటమిన్ C, B6, ఫోలేట్ వంటి కీలక పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉల్లిపాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఇమ్యునిటీ పెంచుతుంది: మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ C శరీరంలో ఇమ్యునిటీ పవర్ (రోగనిరోధక శక్తి)ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
జీర్ణ క్రియ సక్రమంగా సాగాలంటే..: ఉల్లి పాయల్లో ఫైబర్ అధికం. నిత్యం ఉల్లిపాయలు తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. అందుకే, చాలామంది పచ్చి ఉల్లిపాయలను అన్నంలో నంచుకుని మరీ తింటుంటారు.
వ్యాధుల నుంచి రక్షిస్తుంది: ఉల్లిలో ఉండే అల్లిసిన్, క్వెర్సిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఈ పిండి పదార్థాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.
ఉల్లిపాయలను తినడం మానేస్తే ఏమవుతుంది?
ఉల్లిపాయలు మానేయడం వల్ల శరీరానికి లభించాల్సిన పోషకాలేవీ దక్కవు. శరీరానికి కావల్సినంత ఫైబర్ అందకపోవడం వల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి. అంతేకాదు.. ఇంకా విటమిన్ C, B6, ఫోలేట్ వంటి పోషకాల లోపం ఏర్పడి వల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల లోపం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సైతం మందగిస్తుంది.
రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా మందగిస్తుంది. అందుకే నిపుణులు కూడా ఉల్లి పాయలను ఆహారంలో చేర్చుకుని తినాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే కార్తీక మాసంలో ఉల్లిపాయలను మానేసినవారు ఈ విషయంలో పెద్దగా ఆందోళన వద్దు. మీరు ఏదో ఒక కూరగాయ, ఆహారం ద్వారా.. ఉల్లి ద్వారా లభించే పోషకాలను తీసుకొనే ఉంటారు. కాబట్టి.. నో వర్రీస్.
ఉల్లిపాయల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
⦿ ఉల్లిపాయలు సాధారణంగా చిన్నగానే ఉంటాయి. కానీ, ఇంగ్లండ్‌లో పండించిన ఓ రకం ఉల్లిపాయ.. ఒక్కటీ రూ.5 కిలోల బరువుతో రికార్డు సృష్టించాయి.
⦿ ప్రాచీన వైద్యంలో ఉల్లిపాయలను తరచుగా వాడేవారనే సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఉల్లిపాయలను ఎక్కువగా వాడేవారు.
⦿ చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉల్లిని ఎక్కువగా వాడేవారు. అలాగే చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించే శక్తి సైతం ఉల్లిపాయలకు ఎక్కువే.
⦿ పర్పుల్ కలర్‌లో లభించే ఉల్లి పాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఈ ఉల్లి పాయలు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే దొరుకుతాయి.
⦿ ఉల్లి తొక్కల్లో కూడా ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంటే నమ్మలేరు కదా. కానీ, అది నిజం. కొందరు ఉల్లి తొక్కలను నీటిలో మరిగించి మరీ తాగుతారు.
⦿ ఉల్లిలో ఉండే సల్ఫర్.. కండరాలకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలను మెరుగుపరుస్తాయి. వ్యాయామాలు ఎక్కువ చేసేవారికి చాలా మేలు చేస్తుంది.
⦿ ఉల్లిపాయలు తియ్యగా ఉండవు. కానీ, అందులో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. వాటిని వేడి చేసినప్పుడు ఆ తీపితనం బయటపడుతుంది.
⦿ ఉల్లిపాయల్లో సుమారు 89 శాతం నీరే ఉంటుందట. దానివల్ల అది మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఉదయాన్నే మజ్జిగా, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే ఎంతో మేలు.
⦿ ఉల్లిపాయలను ఇంటి చుట్టూ ఉంచితే కీటకాలు దరిచేరవని.. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు నమ్ముతారు.
⦿ ఉల్లిపాయలను కోస్తున్నప్పుడు కంటి నీరు రావడానికి కారణం.. అందులో ఉండే రసాయనమే. ఉల్లి గడ్డలను కోసినప్పుడు ఆ వాయువు కళ్లలోకి చేరి మంట పుట్టిస్తుంది.