మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది జుట్టు రాలడం. బిజీ బిజీ లైఫ్ లో జీవనశైలి మారడంతో మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, కాలుష్యం, సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల జుట్టు మీద ప్రభావం ఎక్కువ పడుతుంది.
దీంతో వెంట్రుకలు పల్చబడటం, జుట్టు రాలిపోవడం, చుండ్రు పట్టడం వంటివి జరుగుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రోడక్ట్లు వాడడం వంటివి ట్రై చేస్తున్నారు. కానీ ఫలితం లేక పోతుంది. అందువల్ల మీరు జుట్టు రాలేకపోవడానికి గల కారణాలను తెలుసుకొని.. వాటికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా జుట్టు రాలిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం.
డైటింగ్
చాలామంది మహిళలు బరువు తగ్గడం కోసం భోజనం చేయకుండా డైటింగ్ చేస్తుంటారు. ఈ డైటింగ్ కారణంగా మహిళల శరీరానికి సరైన పోషకాలు అందవు. దీంతో పోషకాహార లోపంతో జుట్టుకు తగిన పోషణ అందదు. ఈ కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. వెంట్రుకలు పల్చబడి పోతాయి. అందువల్ల ఏదైనా డైటింగ్ చేయాలంటే ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి.
థైరాయిడ్
మహిళల్లో థైరాయిడ్ కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ వలన శరీరంలో అవసరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలలోపం కారణంగా జుట్టు పెరుగుదలకు అవసరాన్ని పోషకాలు అందవు. ఇది జుట్టు రాలడానికి ఒక సమస్యగా చెబుతున్నారు.
గర్భధారణ సమయం
స్త్రీల గర్భదారణ సమయంలో హార్మోన్లలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. దీనివలన జుట్టు రాలడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో ఇలా జరగకుండా ఉండాలంటే విటమిన్లు, ఐరన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
కెమికల్ ప్రొడక్ట్స్
చాలామంది మహిళలు తమ జుట్టు అందంగా, నాజుక్ గా, ఎంతో స్టైలిష్ గా ఉండాలని చాలా కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతారు. ఆ సమయంలో వారికి కావలసిన ఫలితాన్ని అందించిన.. ఆ తర్వాత మాత్రం దుష్ప్రభావాలు చూపిస్తాయి. జుట్టు రాలడం, జుట్టుపలచబడటం వంటివి జరుగుతాయి.