Tirupati Stampede: తిరుపతిలో ఘోరం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ చేస్తుండగా భక్తులు పోటెత్తారు. ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు అదుపుతప్పి కిందపడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో నలుగురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. ఘటనలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు.
ఏం జరిగింది?
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుపతి వచ్చారు. విష్ణు నివాసం, బైరాగిపట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రల్లో ఉచిత దర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో వేచి చూశారు. టోకెన్లు ఇచ్చేందుకు భక్తులను ఒకేసారి లోపలికి వదిలారు. క్యూలైన్లోకి వెళ్లే క్రమంలో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో కొందరిని రుయా ఆసుపత్రికి, కొందరిని సిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సమాచారం తెలియగానే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్ రూయా హాస్పిటల్‌కు చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లకు గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. దీంతో బుధవారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడే కూర్చొని పడిగాపులు కాశారు. దీంతో కొందరిని బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కుకు భక్తులను తరలించారు. అయితే టోకెన్ల జారీ కేంద్రంలోని ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అతడిని హాస్పిటల్‌కు తరలించేందుకు క్యూలైన్ తలుపులు తెరిచారు. అయితే, ఆ గేట్లు టోకెన్ల కోసమే తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా క్యూలైన్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.