Pawan in BJP Trap: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో పడిపోతున్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పని పరిస్థితిని బీజేపీ పెద్దలు కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను పక్కా హిందూత్వ వాదిగా మార్చడమే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన ప్రభావం బాగా ఉందని.. ఆయనకు రీజనల్ పార్టీ సూటవదని చెప్పి చివరికి ఆయనను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ గత రాజకీయాలు.. ముఖ్యంగా మోదీ, షా రాజకీయ ప్లాన్లు చూస్తే జరుగుతోంది ఇదేనని ఎవరికైనా అర్థమవుతుంది. మరి పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా ?
ప్రాణం అయినా వదులుకుంటా కానీ జనసేనను విలీనం చేయబోనంటున్న పవన్
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన కూడా ఆయన సోదరుడు చిరంజీవిలాగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లుగా జనసేన పార్టీని కూడా ఏదో పార్టీలో విలీనం చేస్తారని సెటైర్లు వేశారు. అయితే ఈ విమర్శలతో కూడిన సెటైర్లను పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన పార్టీని విలీనం చేయడం అనేది జరగని పని అని.. తన ప్రాణాలు పోయినా జనసేన పార్టీ మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని చెబుతూ వస్తున్నారు. పొత్తులకు ఆయన సిద్దమే కానీ.. తన ఐడెంటిటీ అయిన జనసేన పార్టీని ఆయన వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు.
జనసేనను విలీనం చేసుకునేందుకు బీజేపీ విఫలయత్నాలు
జనసేనతో ఏమీ చేయలేవు.. బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ ఇంచార్జ్ గా సిద్దార్థనాథ్ సింగ్ అనే నేత ఉన్నప్పుడు పవన్ తో రాయబారం నడిపారు. పవన్ కల్యాణ్ ఈ ప్రతిపాదనను బీజేపీ పెద్దల వద్ద నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఓ సారి నేరుగానే చెప్పారు. ఆయన చెప్పకపోయినా పవన్ పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చినప్పటి నుంచి బీజేపీలో విలీనానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పవన్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నారు. కానీ ఈ సారి బీజేపీ అగ్రనేతలు వేస్తున్న ట్రాప్‌కు పవన్ కల్యాణ్ చిక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌ను దక్షిణాది నేతగా చేసే ప్లాన్
పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని మొదట అమిత్ షా ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ముందు రాష్ట్రంలో తేల్చుకోవాలనుకున్నానని అందుకే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆయన తేల్చేశారు. బీజేపీ ప్లాన్ ను పవన్ అక్కడే మొదటి సారి తిప్పికొట్టారు. కానీ తర్వాత ఎప్పుడైనా వారి హిందూత్వ రాజకీయ బ్రాండ్ ను తన నెత్తి మీద వేసుకోవడానికి అంగీకరించారో అక్కడే ఆయన బీజేపీ ట్రాప్ లో పడిపోయారని అనుకోవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత ఆయనను తమిళనాడులో ఉపయోగించుకోనున్నారు. అన్ని చోట్లా ఆయన ముద్ర హిందూత్వమే. అంటే.. దక్షిణాది హిందూత్వ నేతగా పవన్ ను ఫోకస్ చేయబోతున్నారు.
జనసేనతో ఏమీ చేయలేదని బీజేపీలో చేరితే సీఎం కావొచ్చని పని పూర్తి చేసే అవకాశం
పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్త గుర్తింపు ఉందని ఇప్పుడు ఉన్నట్లుగా జనసేన పార్టీతోనే ఉంటే.. ఏపీలో ఎప్పుడూ పాతిక సీట్లకు మించి ముందుకు పోలేవని అదే బీజేపీలో అయితే జాతీయస్థాయి నేత కావడంతో ఎప్పటికైనా సీఎం పదవి వస్తుందని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు తన మిషన్ పూర్తియందని.. ఇంకా విస్తృతమైన రాజకీయం చేయడానికి బీజేపీనే కరెక్ట్ అని అనిపిస్తే విలీనం పూర్తవుతుంది. ఇలాంటి పరిస్థితి తేవడానికి బీజేపీ హైకమాండ్ రెండేళ్ల గడువు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అంటే రెండేళ్ల తర్వాత జనసేన పార్టీ ఉండదని అనుకోవచ్చు. ఎందుకంటే మోదీ , షా అనుకుంటే అయిపోతుంది మరి !