TDP: టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెబుతూ ఉంటారు. నేతలు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ పార్టీని అంటి పెట్టుకుని ఉండేది క్యాడరే. ఇప్పుడు ఆ క్యాడర్ సోషల్ మీడియానూ ఊపేస్తున్నారు. వారిలో చాలా మంది పార్టీ నేతలతో కానీ.. పార్టీతో కానీ డైరక్ట్ గా సంబంధాలు ఉండవు. అభిమానంతోనే పని చేస్తూ ఉంటారు. వారికి పార్టీనే ముఖ్యం. అందుకే పార్టీ నేతలు .. పార్టీని అవమానించినట్లు..పార్టీ అధినేతను కించపరిచినట్లుగా అనిపిస్తే మాత్రం ఊరుకోవడంలేదు. దానికి తాజా సాక్ష్యం.. పార్థసారధి, గౌతు శీరిషలకు ఎదురవుతున్న అనుభవమే.
పార్టీ నేతలపై టీడీపీ క్యాడర్ తిరుగుబాటు
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో ఓ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్థసారధి, గౌతు శిరీష, కొనకళ్ల బ్రదర్స్ పార్టీ క్యాడర్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ క్యాడర్ స్పందనను చూసి హైకమాండ్ కూడా వారిని మందలించాల్సి వచ్చింది. టీడీపీలో మాత్రమే క్యాడర్ ఇంత యాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే ఇది మంచికా.. చెడుకా అన్నది మాత్రం ఆ పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు. యథాలాపంగా రాజకీయాల్లో కొన్ని. జరిగిపోతాయి. రాజకీయ నేతలు చేసే చిన్న చిన్న పనుల వల్ల పార్టీ, పార్టీ క్యాడర్ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. వాటిని సరి చేసుకోవడం అంత తేలిక కాదు. పైగా పెంచుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏపీ మంత్రి పార్థసారధి పరిస్థితి అదే. స్వయంగా ఆయన వైసీపీ నుంచి వచ్చినప్పటికీ ఆహ్వానించిన టీడీపీ క్యాడర్ జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకోవడాన్ని అసలు సహించలేకపోయారు. పార్థసారధిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతోందంటే… ఆయన ఇప్పటికి రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణలు చెప్పారు. చంద్రబాబును కూడా కలిసి జరిగిందేమిటో చెప్పాల్సి వచ్చింది.
సామాజికవర్గం కారణంగా జోగి రమేష్ కు ఆహ్వానం
నిజానికి జోగి రమేష్ తో పాల్గొన్న కార్యక్రమం పార్టీ రహితమైనది. అన్ని పార్టీల నేతలు వస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య కాదని అనుకుని ఉంటారు. కానీ వైసీపీ హయాంలో చంద్రబాబుపైన, పార్టీ నేతలపైనా జోగి రమేష్ చేసిన దాడిని మాత్రం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. పార్థసారధికి ఎదురవుతున్న పరిస్థితులు అనేక మంది టీడీపీ నేతలకు పాఠం లాంటిది. కనువిప్పు లాంటివని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలతో ఏమైనా సంబంధాలు ఉంటే వారి కోసం లాబీయింగ్ చేయడం ఆపేసుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా వారితో తిరగడం మానేయాల్సిందిగా ఉంటుంది. ఏదైనా వ్యాపార సంబంధాలు ఉన్నా.. ఎప్పుడైనా బయటపడితే మొదటికే మోసం వస్తుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
క్యాడర్ ను కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా !
టీడీపీ కోసం పని చేసిన క్యాడర్ .. తమ మనోభావాలకు విరుద్దంగా పార్టీ నేతలు వెళ్తే అసలు సహించడం లేదు. గతంలో వేధించిన వారి నీడ టీడీపీపై పడినా సహించడం లేదు. అయితే ఇలాంటి దూకుడు ఒక్కో సారి పార్టీకి నష్టం చేస్తుంది. రాజకీయ అంటే స్ట్రెయిట్ గా వెళ్లిపోవడం కాదు. ఏ దారిలో వెళ్లినా విజయాన్ని అందుకోవడం. అందు కోసం ఒక్కో సారి గొంగళి పురుగును అయినాముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. పాత కథలన్నీ గుర్తు చేసుకుని రచ్చ చేసుకుంటూ పోతే నష్టమే జరుగుతుంది. టీడీపీ క్యాడర్ ఈ వాస్తవాలను గుర్తించలేకపోతే సొంత పార్టీకి నష్టం చేసుకున్న వారవుతారు.