వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ – సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ - సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

Chevireddy New Number Two In YSRCP:   వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్తగా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. కానీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి అందరూ చెవిరెడ్డికి రిపోర్టు చేస్తున్నారు. ఆయన అధీనంలోకి ఆఫీసు వెళ్లిపోయింది. సజ్జలను సంప్రదించేవారు తగ్గిపోయారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ క్యాడర్  వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ దాదాపుగా క్లోజింగ్‌కు దగ్గరగా వచ్చిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. 

సజ్జలపై పార్టీ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత

పార్టీ ఘోర ఓటమికి సజ్జలే అన్న అభిప్రాయం కింది నుంచి పై దాకా క్యాడర్ లో ఉంది. అధికారం అందిన తర్వాత మొత్తం తానై  పనులు చక్కబెట్టిన ఆయనను జగన్ క్రమంగా దూరం పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఆయనను దూరం పెడుతున్నానని చెప్పడానికి పదవులు ఇస్తారు కానీ పనులు చెప్పకపోవడమే సాక్ష్యమని ్నుకోవచ్చు.  ఆయన వల్లే జరగాల్సిన నష్టం జరిగిందన్న అభిప్రాయం కల్పించేలా  ఇటీవల కాలంలో  సొంత మీడియాలో కథనాలు వచ్చాయి.  అయితే ఆయనను నిర్లక్ష్యం చేశారన్నది భావన రాకుండా మెల్లగా ఆయన ప్లేస్‌లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చేశారు. 

జగన్‌కు అత్యంత సన్నిహితంగా మారిన చెవిరెడ్డి

కొంత కాలంగా సీఎం జగన్‌కు చెవిరెడ్డి అత్యంత సన్నిహితమయ్యారు.  ఏం కావాలన్నా ఆయన చేసి పెడుతున్నారు. చాలా వరకు అంతర్గత వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ఇప్పుడు నెంబర్ టు పొజిషన్ ను మార్చాలని నిర్ణయించుకోవడంతోనే  ఇప్పుడు చెవిరెడ్డికి పట్టు పెంచుతున్నారు. సీఎం జగన్ ది మొదటి నుంచి ఓ భిన్నమైన శైలి. మొత్తం నిర్ణయాలు తానే తీసుకున్నా…  ఆది సలహాదారుల ప్రభావం అన్నట్లుగా కవరింగ్ చేసుకుంటూ ఉంటారని అంటారు.  ఏ చిన్న మంచి జరిగినా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. తప్పు  జరిగితే మాత్రం సలహాదారులపై తోసేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.   ఇప్పుడు పార్టీకే గడ్డు పరిస్థితి వచ్చినందున సజ్జలను సైతం పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  చెవిరెడ్డి ఆ బాధ్యతలను నిర్వహించడం అప్పుడే ప్రారంభించారని అంటున్నారు.  

చెవిరెడ్డి చెప్పినట్లే పార్టీ పదవులు 

జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతర్గత నియామకాల బాధ్యత… పార్టీ నిర్మాణం పనులను చెవిరెడ్డికి అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాను సజ్జల కన్నా భిన్నంగా ఆలోచిస్తానని చెప్పేందుకు విచిత్రమైన నియామకాలకు సిఫారసులు చేస్తున్నారని అంటున్నారు. అలాగే పలు నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు విషయంలోనూ ఆయన చెప్పిందే జరుగుతోందని అంటున్నారు.  ఇప్పుడు పార్టీలో ఎక్కువ మంది సజ్జలను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. చెవిరెడ్డిని కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనను కలిస్తే పనులు అయిపోతాయన్న నమ్మకం ఉండటమే కారణం .  పార్టీలో పదవులు చెవిరెడ్డి చేతుల మీదుగా భర్తీ అవుతున్నాయని తెలిసిన తర్వాత సజ్జల ఆఫీసు బోసిపోతోంది.  

పెద్దిరెడ్డి కూడా అందుకే అలిగారా ? 

చిత్తూరు జిల్లా వైసీపీని కనుసైగలతో నడిపించిన వైసీపీ నెంబర్ టూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లోకువయ్యారు. చెవిరెడ్డి వద్దన్నారని చెప్పి మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి జగన్ రెడ్డి తొలగించారు. పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించి తీసేశారు.  ఈ కారణాలతోనే వారు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదని అంటున్నారు. వారిని కూడా కాదని చెవిరెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారంటే అయనే నెంబర్ టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. 

తరవాత కథనం