ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని టిటిడి ఈవో జే. శ్యామల రావు తెలిపారు.
సీఎం చంద్రబాబు రానుండడంతో కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అందువల్ల కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం పారామెడికల్, పోలీసులు, శ్రీవారి సేవకులు, టీటీడీ ఉద్యోగులు కళ్యాణ ప్రాంగణంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణ్ వేదిక ప్రవేశ మార్గంలో తలంబ్రాలు పంపిణీ కోసం మొదటిసారిగా 28 కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి తలంబ్రాలు, శ్రీవారి లడ్డు, కంకణం, అన్న ప్రసాదాలు అందిస్తామని.. దీనికోసమే ఏర్పాట్లు చేసేమని తెలిపారు.
ఆలయ సమీపంలో 3,000 మంది భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్డులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే సీతారాముల కళ్యాణం చూసేందుకు వచ్చిన భక్తుల కోసం అత్యధిక టెక్నాలజీతో 21 ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కళ్యాణోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీసు యంత్రాంగం నుండి 2500 మంది భద్రత సిబ్బందితో భద్రత కల్పించనున్నారు.