CM Revanth Reddy: శ్రీరామనవమి వేడుక.. సన్నబియ్యం లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..!

ఇవాళ శ్రీరామనవమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అక్కడ సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సారపాక గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు సన్న బియ్యం లబ్ధిదారుడు బోరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం భోజనం చేశారు. సన్న బియ్యం లబ్ధిదారుల కుటుంబంతో భోజనం చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే సన్న బియ్యం ఎట్లున్నాయి అంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను సీఎం అడిగారు.

దానికి ఆమె సమాధానం ఇస్తూ.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునే ఆసక్తి ఉండేది కాదని.. కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడంతో మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

సన్న బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దానికి తులసమ్మ.. అన్ని అందుతున్నాయని.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.

తరవాత కథనం