Revanth Reddy: రేవంత్ రెడ్డి. ఇప్పుడీ పేరు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అగ్రనాయకుల జాబితాలో ఉంటుంది. ఆయన వయసు రాహుల్ తో సమానం. కానీ రాహుల్ గాంధీ అనే వారసత్వాన్ని పట్టుకుని వచ్చారు. రేవంత్ రెడ్డి కింది నుంచి పైకి ఎదిగారు. అసాధ్యమనుకున్న తెలంగాణలో అధికారాన్ని ఆయన చేతుల్లోకి తెచ్చి పెట్టారు. అయితే సహజసిద్దమైన అహంకారంతో ఆయనను హైకమాండ్ నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడటం దగ్గర నుంచి ఓ హైకమాండ్ ప్రతినిధిని హైదరాబాద్లోనే ఉంచి సమాంతర పాలన చేయాలని ప్రయత్నిస్తూండటం దీనికి సంకేతాలు. రేవంత్ రెడ్డి లాంటి ప్రజల్లో నుంచి వచ్చిన నేతను ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోకుండా.. ఆయనను బలహీనం చేసి అదే గొప్ప రాజకీయం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పతనం ఎంతో కాలం ఉండదు.
ప్రజానాయకుల్ని బలహీనపర్చడం కాంగ్రెస్ హైకమాండ్ బ్యాడ్ హ్యాబిట్
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడిందని అనుకుంటారు. నిజానికి బలహీనపడలేదు. కాంగ్రెస్ అన్ని చోట్లా బలంగానే ఉంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీలు పెట్టుకున్న వారు బలంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ను వారు తీసుకెళ్లిపోయారు. మమతాబెనర్జీ కాంగ్రెస్ నుంచి వెళ్లకపోతే ఇప్పుడు బెంగాల్ లో తిరుగులేని స్థితిలో ఉండేది కాంగ్రెస్సే. మహారాష్ట్రలో శరద్ పవార్ కాంగ్రెస్ లోనే ఉంటే.. అక్కడ తిరుగులేని పార్టీ కాంగ్రెస్. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని వెళ్లిపోయేలా చేయకపోతే తిరుగుఉండేదా ?. తమిళనాడులో జీకే మూపనార్ తో చేసిన రాజకీయంతో ఆ పార్టీ బలహీనపడింది. తోక పార్టీలా మారింది. వీరందరూ ఎందుకు పార్టీ మారిపోయారంటే చెప్పాల్సిన పని లేదు. వారందర్నీ కాంగ్రెస్ హైకమాండ్ బలహీనం చేయాలనుకుంది. అందుకే వారు పార్టీ మారిపోయి తమ బలాన్ని తాము నిరూపించుకున్నారు.
రేవంత్ విషయంలోనూ అదే తప్పు చేస్తున్న సూచనలు
రేవంత్ రెడ్డితెలంగాణను అధికారంలోకి తీసుకు వచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు నైతిక బలం అందిస్తున్నారు. గాంధీ అజెండాను సెట్ చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారని రేవంత్ రెడ్డినే అజెండాగా మార్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతినడానికి రేవంత్ రెడ్డి కూడా ఓ కారణం. అలాంటి రేవంత్ రెడ్డిని స్వయంగా బలహీనం చేసేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూండటమే కాంగ్రెస్ తీరు మారదని చెప్పుకోవడానికి అవకాశంగా మారుతోంది. ఏడాది అయిపోయింది ఇంత వరకూ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే భర్తీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు సరి కదా.. ఎంతో మంది పదవుల కోసం ఎదురు చూస్తూంటే.. వినోదం చూస్తోంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి లేదని విపక్షాలు ప్రచారం చేస్తూంటే ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో సమాంతర పాలన కోసం కాంగ్రెస్ ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షిని హైదరాబాద్లోనే మకాం వేయమని ప్రోత్సహించారు. ఆమె పాలనలో జోక్యం చేసుకుంటున్నారని అంతా గగ్గోలు రేగుతోంది.
రేవంత్ ను బలహీన పరిచేందుకు ప్రయత్నాలు
కాంగ్రెస్ హైకమాండ్ తీరు చూస్తూంటే రేవంత్ రెడ్డి అంత కంటే ఎక్కువగా ఎదిగితే తమకు ప్రమాదమని అనుకుంటున్నారని ఎవరికైనా అనిపిస్తుంది. ప్రజాబలం లేని కాంగ్రెస్ హైకమాండ్ చుట్టూ తిరిగే నేతల వల్లే కాంగ్రెస్ పడిపోతోంది. బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఉత్తమ్ రెడ్డి, బట్టి విక్రమార్కల వల్ల ఏమీ కానీ రెండు ఎన్నికల్లో తేలిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందంటే కారణం రేవంత్ రెడ్డి. అయినా రేవంత్ ను బలహీనం చేసేందుకు ఇతర నేతల్ని ప్రోత్సహిస్తున్నారు.
వెళ్లగొడితే తెలంగాణలో కాంగ్రెస్ మటుమాయం
రేవంత్ రెడ్డిని వెళ్లగొట్టడమో.. వెళ్లిపోయేలానో చేస్తే ఎవరికి లాస్ ?. ఏపీలో జగన్ రెడ్డితో పాటు వెళ్లిపోయినట్లుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకుంటే పార్టీ క్యాడర్ అంతా వెళ్లిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం ఉండాలి. ఇతర నేతలు ఎవరిపైనా నమ్మకం ఉండదు. గతంలో చేసిన తప్పుల్నే కాంగ్రెస్ పునరావృతం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగు చేయలేరు. బీజేపీ కూడా జాతీయ స్థాయిలో బలోపేతం అయింది. ఆ పార్టీని ఒక్కరంటే ఒక్కరైనా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోగలిగారా?. అలాగని బలమైన నేతల్ని దూరం చేసుకున్నారా?. రేవంత్ మరో జగన్ , శరద్ పవార్, మమతా బెనర్జీ కావాలో లేదో కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉంది.