Nitish Kumar Reddy: ఫాదర్ ఆఫ్ ద ఇయర్ ముత్యాలరెడ్డి – నితీష్ కోసం ఆయన చేసిన త్యాగాలే ఆ కన్నీళ్లు !

ఫాదర్ ఆఫ్ ఇయర్ ముత్యాలరెడ్డి - నితీష్ కోసం ఆయన చేసిన త్యాగాలే ఆ కన్నీళ్లు !

Mutyala Reddy:   బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లను బాక్సింగ్ ఆడేసుకున్న  నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన తర్వాత స్టాండ్స్ లో ఉన్న ఓ వ్యక్తి భావోద్వేగం హైలెట్ అయింది. తర్వాత ఆయనెవరో తెలిసి ఆ మాత్రం ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఆ భావోద్వేగం.. వెనుక ఉన్న త్యాగం మాత్రం చాలా మమందికి తెలియదు.  తర్వాత హోటల్ రూంకు వచ్చినప్పుడు కుటుంబం అంతా ఆనంద భాష్పాలతో ఎమోషనల్ అయిన దృశ్యాలు చూసి అందరి కళ్లు చెమర్చి ఉంటాయి. ఆ వ్యక్తి ముత్యాలరెడ్డి, సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి. 

కుమారుడి కెరీర్ కోసం జీవితాన్ని త్యాగం చేసిన ముత్యాలరెడ్డి

గాజువాక సమీపంలోని ఓ చిన్న అద్దె ఇంట్లో నుంచి ముత్యాలరెడ్డి జీవితం ప్రారంభణయింది.  21 ఏళ్ల కిందట గాజువాక సమీపంలో హిందూస్థాన్ జింక్ ఉద్యోగి ముత్యాలరెడ్డి తనకు కుమారుడు పుట్టాడని మురిసిపోయాడు. కానీ మంచి భవిష్యత్ ఇచ్చేలా పెంచగలనా అని మధనపడ్డాడు. కానీ తన శక్తిలోపం ఉండకూడదనుకున్నాడు. అలా ముత్యాలరెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి పదేళ్లకే క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు. మంచి ప్రతిభ చూపుతున్నాడు. అప్పుడు ముత్యాలరెడ్డి క్రికెట్లో తన కుమారుడ్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన పని చేస్తున్న కంపెనీ యూనిట్ క్లోజ్ అయింది. గుజరాత్ యూనిట్ కు వస్తే ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ తన కుమారుడి క్రికెట్ కోసం అండగా ఉండాలని ఉద్యోగం వదులుకున్నారు. 

ఆకలితో అలమటించినా కుమారుడు క్రికెట్ కోసం మాత్రం ఎక్కడా తగ్గలేదు 

ముత్యాలరెడ్డి  కుటుంబానికి సొంత ఇల్లు లేదు. ఆటల్లో వచ్చిన ట్రోఫిలను పెట్టుకోవడానికి ప్రత్యేకమైన అల్మరాలు కూడా లేవు. ఏదైనా ప్రైజ్ మనీ వచ్చినప్పుడు నితీష్ కుమార్ ఆటను మెరుగుపరచుకోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేవారు. ఆయన శ్రమ వృధాపోలేదు. రంజీల్లో ఆయన చూపించిన ప్రతిభతో ఐపీఎల్‌కు వచ్చారు. అక్కడ్నుంచి జాతీయ జట్టుకు వచ్చారు.  ఇప్పుడు మెల్బోర్న్‌లో తన  టాలెంట్ ప్రపంచం ముందు ఉంచాడు. ఇప్పుడు ముత్యాలరెడ్డి ఆనందం ఎంత ఉంటుందో.. తన తండ్రి తన కోసం ఏం త్యాగం చేశాడో.. అ త్యాగానికి సరైన విజయాన్ని అందించానని నితీష్ కుమార్ రెడ్డి కూడా సంతోషంగా ఉంటారనడంలో సందేహం లేదు. 

తండ్రి కష్టాన్ని చూస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నితీష్ 

  పేదరికంలో పుట్టినా క్రికెట్ మన కోసం కాదని ఎప్పుడూ నితీష్ అనుకోలేదు. ఆ ఆలోచన మనసులోకి రానీయకుండా ముత్యాలరెడ్డి కష్టపడ్డారు. ఇవాళ భారత్ కు భవిష్యత్ సూపర్ స్టార్ నని నిరూపించుకుంటున్నారు. నితీష్ కుమార్ కెరీర్.. ఉన్నతంగా ఉంటుందనడానికి ఆయన ఎదిగి వచ్చిన మెట్లే సాక్ష్యం. అమాంతం పైకి ఎక్కేవారు ఒక్కసారే అలా పడిపోతారేమోకానీ.. నితీష్ లాగా శ్రమతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చినవారి కెరీర్ సుదీర్ఘంగా ఉంటుందని చెప్పవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి కష్టం చూస్తూ పెరిగారు కాబట్టి ఆయన ఎప్పుడూ తన దారి మర్చిపోరని అనుకుందాం. దీనంతటికి కారణం ఆయనతండ్రి ముత్యాలరెడ్డే. అందుకే ఆయనే ఫాదర్ ఆఫ్ ఇయర్ 2024.

తరవాత కథనం