Delhi Assembly Elections 2025: ఇది ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి కాదు- రాజకీయల నుంచి సామాన్యుడి నిష్క్రమణ

Kejriwal

Delhi Assembly Elections 2025: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశ యువతను ఏక  తాటి పైకి తీసుకొచ్చి నాటి యూపీ ప్రభుత్వానికి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేజ్రీవాల్ అదే అవినీతి  మరకతో  పోరాటం చేసిన ప్రాంతంలోనే ఓటమి పాలయ్యారు.  రాజకీయాల్లో    ధన బలం, కండ బలం ఉంటేనే రాణించగలమని అప్పటి వరకు   నడుస్తున్నట్రెండ్‌ను బ్రేక్ చేసి ఓ సామాన్యుడు కూడా రాజకీయం చేయగలడని నిరూపించారు కేజ్రీవాల్. గుండె ధైర్యం ఉంటే చాలని  ప్రూవ్ చేశారు. అప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి  అంగబలం , అర్ధబలాన్ని కాదని ప్రజలను ఒప్పించి ఢిల్లీ పీఠంపై కూర్చున్నారు. అయితే అప్పటి  రాజకీయ చదరంగంలో   ఎత్తుల వేయడంలో తడబడిన కేజ్రీవాల్ ప్రభుత్వం   కూలిపోయింది. మళ్లీ  ప్రజలను మెప్పించి ఈసారి ప్రత్యర్థులకు కనీసం ప్రతిపక్ష హోదా కూడ లేకుండా చీపురుతో ఊడ్చేశారు.

చీపురు పట్టుకొని వందేమాతర నినాదంతో ప్రజల్లో ఒకడిగా ఉంటూ సాగించిన రాజకీయం దేశంలో చాలా మందికి రోల్‌మోడల్‌గా మారింది. డబ్బుల్లేని రాజకీయం మనం కూడా చేయగలమనే ధైర్యం ఇచ్చింది.     కానీ ఢిల్లీ ప్రజల ఆలోచన  సరళి వేరు, ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల స్థితిగతులు వేరు కావడంతో  వారు విజయవంతం కాలేకపోయారు. కానీ  కేజ్రీవాల్ స్ఫూర్తి మాత్రం కొనసాగుతూ వచ్చింది. అప్పట్లో ఏదో   అవినీతి వ్యతిరేక ఉద్యమ  వేడిలో వచ్చారని అంతా అనుకున్నారు కానీ, రెండో సారి కూడా బీజేపీ  రాజకీయాన్ని ఎదురొడ్డి  ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీ వాల్ ప్రమాణం చేశారు.

ఇలా రెండుసార్లు అధికారంలోకి రావడంతో ఆప్‌లో అప్పటి వరకు ఉన్న ఆత్మ విశ్వాసం అతి విశ్వాసంగా మారింది. ఏం చేసినా ప్రజలు హర్షిస్తారనే  ధోరణిలోకి కేజ్రివాల్ వెళ్లిపోయారు.   ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ వారితో ఉన్న అటాచ్‌మెంట్‌ తెగిపోతూ వచ్చింది. ఎన్నికల హామీలు పూర్తిగా  మర్చిపోయారు. మద్యం పాలసీతో విమర్శలు పాలయ్యారు.  నిత్యం కేంద్రంతో ఘర్షణపూర్తి వాతావరణం ప్రజల్లో విసుగుతెప్పించింది.

2020లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ విధానాలపై విమర్సలు వెల్లువెత్తడం మొదలైంది. ప్రతి విషయానికి కేంద్రంతో సున్నం పెట్టుకోవడం, ఇచ్చిన హామీల విషయం పట్టించుకోకపోవడంతో ఢిల్లీ ప్రజలు  ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సి వచ్చింది. ఆప్ విస్తరణ ప్రణాళికల్లో బిజిగా ఉండిపోయారు. పక్కనే పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత  మరిన్ని రాష్ట్రాల్లో ఆప్‌ పోటీ చేయాలని భావించారు.  ఇది వర్కౌట్ కాలేదు. కానీ దీన్ని థ్రెట్‌గా భావించిన కేంద్రం కేజ్రీవాల్ పై   ఫోకస్ పెట్టింది.

ఢిల్లీలో  ఏపని చేయాలన్నా కేజ్రీవాల్ అడుపడుతుండటం, అన్నింటికీ రోడ్లపైకి రావడం బీజేపీకి మింగుడుపడని అంశంగా మారింది.  దీంతో లెఫ్టినెంట్‌ జనరల్‌ రంగంలోకి దిగారు.    ఇంతలో మద్యం పాలసీ  తీగ దొరికింది . దాన్ని గట్టిగా లాగిన కేంద్ర సంస్థలు ముందు డిప్యూటీ సీఎంను తర్వాత సీఎంను అరెస్టు చేశారు.  అయితే ప్రభుత్వం ఏమవుతుందో అన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడటంతోపాటు బీజేపీ కూడా ఎన్నికల ముందు కెలకడం ఎందుకని  వదిలేయడంతో జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడిపించారు . విడుదలైన తర్వాత అతిషిను  సీఎంగా ప్రకటించారు.

జైలుకు వెళ్లి వచ్చిన వారంతా సీఎంలుగా అవుతూ వస్తున్నారు. ఈసారి కేజ్రీవాల్ కూడా అదే సెంటిమెంట్‌తో సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు తారుమారు అయిపోయారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌, కేజ్రీవాల్‌ది ఒకటే కథ. ఇద్దరూ సీఎంలుగా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ హేమంత్ సోరెన్ మరోసారి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ కేజ్రీవాల్‌ మాత్రం ప్రజల మనసులు గెలుచుకోలేకపోయారు.

కేజ్రీవాల్ ఓటమికి కారణాలు

యమున నీళ్లు విషపూరిత ఆరోపణలపై ఆగ్రహం

కేజ్రీవాల్ ఓటమికి  చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది   కేజ్రీవాల్ అర్థరహిత ఆరోపణలు . ఈసారి ఢిల్లీ ఎన్నికలు యమునా  నది నీళ్ల పై ఎక్కువ ప్రచారం జరిగింది. హర్యానా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విషపూరితమైన యుమన నీళ్లు  ఢిల్లీ ప్రజలకు పంపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కానీ దీనిపై బీజేపీ నేతలు, ఘాటుగా బదులిచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి నేరుగా నది వద్దకు వెళ్లి ఆ నీళ్లను తాగి చూపించారు.  అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన ఆరోపణలను నిరూపించలేకపోయారు.   ఇలాంటి ప్రకటనలు కేజ్రీవాల్‌ మద్ధతుదారులతోపాటు వేరే ఎవరికీ నచ్చలేదు.

శీష్మహాల్‌తో మరింత విమర్శలు

కేజ్రీవాల్ రాజకీయాలు చేసిన మొదట్లో  భవంతులకు, మహాల్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.  సామాన్యుడిగా జనంలో తిరగడం ఇష్టమన్నట్టు  ప్రజల్లో తిరిగారు. వీవీఐపీ సంస్కృతికి  చరమగీతం పాడతానని   కారు, బంగ్లా, భద్రత తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఆయన మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాక కాలక్రమేనా జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ తీసుకున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. దీనిపై జాతీయ మీడియా ప్రతి రోజూ స్టోరీలు ప్రచారం చేసింది. దీనికి ప్రత్యర్థులు శీష్మహల్ అని పేరు పెట్టారు. ఈనివాసంపై  చేసిన ఖర్చులను కూడా కాగ్‌ నివేదిక తప్పుపట్టింది.  కోర్టులు  కేసులు ఇలా  అడుగడుగునా కేజ్రీవాల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ వచ్చింది.

హర్యానా నుంచి పాఠాలు నేర్చుకోలేదు

చాలా కాలంగా ఢిల్లీలో పాగా వేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.  ఆ విషయాన్ని మర్చిపోయి   ఐక్యంగా ఉండాల్సిన  సమయంలో కాంగ్రెస్‌ను కాదని ఒంటరిగా పోటీ చేశారు. ఇది కేజ్రీవాల్ అతివిశ్వాసమని విశ్లేషకులు చెబుతారు.  హర్యానాలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఎలాంటి ఫలితాలు  వచ్చాయో చూసినా  ఢిల్లీ జట్టు కట్టలేకపోయారు.  ఇప్పుడు ఆప్‌ ఓటమికి ఇది కూడా కారణం .

ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో కేజ్రీవాల్ చెప్పారు. ఇంత వరకు ఆ హామీ అమలు చేయలేదు. కనీసం ఎన్నికల ముందైనా దాన్ని  అమలు చేసి ఉంటే ఫలితాలు వేరులా ఉండేవీ కానీ   అది జరగలేదు. ఇలాంటి పరిస్థితినే జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎదుర్కొన్నారు. ఇలా నెల నెల      మహిళలకు కొంత నగదు ఇవ్వడంతో  జార్ఖండ్‌లో JMM విజయం సాధించింది. కేజ్రీవాల్ మాత్రం గతేడాది నుంచి  పథకం అమలు చేయాలని భావించారు. కానీ ఆయనకు వీలుపడలేదు. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయలేని వ్యక్తి    వచ్చే ఎన్నికల  తర్వతా ఎలా అమలు చేస్తారని  మహిళలు  ఆలోచించి  వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఢిల్లీలో ఉచితాలను ప్రవేశపెట్టడం ద్వారానే అరవింద్ కేజ్రివాల్ వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు.    దీంతో  కనీస సౌకర్యాలు కల్పించడం మానేశారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టింది. వేసవిలో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారు. ట్యాంకర్ మాఫియా ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించింది. 24 గంటలూ పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ గంటల వ్యవధి కూడా మంచి నీరు అందించలేకపోయారు. ఈ విధంగా క్రమంగా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకం కోల్పోయారు.

అందుకే      ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఘోర ఓటమికి అధినేత కేజ్రివాల్ ఒక పెద్ద కారణంగా తెలుస్తోంది. కేజ్రివాల్ మాటలకు, చేతలకు చాలా    వ్యత్యాసం ఉంది. సామాన్యుడి ప్రతి రూపంగా   వచ్చిన కేజ్రీవాల్ విలాసవంతమైన జీవనశైలిని కోరుకోవడం ప్రజలకు నచ్చలేదు. 40 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘శీష్మహల్’ లాంటి విలాసవంతమైన బంగ్లా నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది.   దేశాన్ని అవినీతిరహితంగా మారుస్తామనే పెద్ద పెద్ద నినాదాలు చేసిన వ్యక్తే కుంభకోణాల్లో అరెస్టు కావడం కూడా నిరాశను పెంచింది. కేజ్రివాల్ నియంతృత్వ నాయకత్వ శైలి, మొండి వైఖరి వంటివి కూడా ఆయన ఓటమికి కారణం.

ఇప్పుడు కేజ్రీవాల్ ఓటమి ప్రభావం పంజాబ్‌పై కూడా పడుతుందని అంటున్నారు. అక్కడ కూడా నాయకులు ఆప్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధమవుతారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు మంచి ఓటు శాతం వచ్చినప్పటికీ కాంగ్రెస్ రూపంలో ప్రమాదం పొంచి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసులు  కేజ్రీవాల్‌ను వెంటాడుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి ప్రభుత్వం పార్టీ  బలంగా నిలబడ్డాయి. ఇప్పుడు మరోసారి జైలుకు వెళ్తే మాత్రం కచ్చితంగా  పార్టీలో ఉండేవారు ఎవరు అనే చర్చ జరుగుతోంది. గతంలో  తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కేజ్రీవాల్ లాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆ ఓటు బ్యాంకు షిప్టు అవ్వడానికి టైం పట్టదని అంటున్నారు. ఇక్కడ కేజ్రీవాల్ బలహీన పడటంతో కాంగ్రెస్‌కు మంచి జరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇకపై ఢిల్లీలో రెండు జాతీయ పార్టీ  రాజకీయం మాత్రమే చూస్తామని అంటున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి  తో సామాన్యుడు రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.

తరవాత కథనం