Avinash Reddy made an internal deal with TDP: కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ.. కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు. వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది. రాజకీయంగా కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమవుతోంది. దీనికి వైసీపీ క్యాంప్ నుంచి వస్తున్న మద్దతు కూడా కీలకమే. ఇదే ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
కార్పొరేటర్లను టీడీపీలోకి పంపిన అవినాష్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట అవినాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వచ్చింది. దీనికి కారణం కడప కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లడమే. వెళ్లిన కొంత మంది కాదు మరికొంత మంది కూడా వెళ్తున్నారని కడప మేయర్ సీటు టీడీపీ ఖాతాలో పడుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం జగన్ కు చేరిందేమో కానీ ఆయన అవినాష్ రెడ్డిపై మండిపడినట్లుగా చెబుతున్నారు. కార్పొరేటర్లు పార్టీ మారిపోతే అవినాష్ రెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ పార్టీ మారింది అవినాష్ రెడ్డి అనుంగు అనుచరులు.
కడపలో ఏం జరుగుతోంది ?
కడపలో కార్పొరేటర్లు ఎవరూ బయట వ్యక్తులు కాదు. అందరూ అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగేవారే. జనంలో నుంచి వచ్చిన వారు ఒక్కరూ లేరు. అయినా వారిలో కొంత మంది తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. అవినాష్ రెడ్డికి తెలియకుండా జరగదన్న సమాచారం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కడపలో టీడీపీలో చేరికల్ని చూస్తూ ఎలా ఉన్నావని ఆయనపై మండిపడినట్లుగా చెబుతున్నారు. ఇక ఎవరూ మారకుండా చూస్తానని అందరితో మాట్లాడతానని అవినాష్ రెడ్డి చెప్పినట్లుగా .. వైసీపీ వర్గాలంటున్నాయి.
రాజకీయంగా ఉండాలంటే తప్పనిసరిగా లోపాయికారీ ఒప్పందాలు
జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులోనే.. తాడేపల్లిలోనే రిలాక్స్ అవుతారని లోకల్ లో రాజకీయం చేయాల్సింది తామేనని.. పట్టువిడుపులు తప్పదని అవినాష్ వర్గం నిట్టూరుస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే కార్పొరేటర్లను అవినాష్ రెడ్డి టీడీపీలోకి పంపుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ అభిప్రాయం కూడా అదేనని అందుకే హెచ్చరించారని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు పార్టీ మారినా అది అవినాష్ రెడ్డి ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి లోకల్ లోనే ఉంటారు. ఆయనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అధికార పార్టీతో ఢీ కొట్టడం కన్నా.. ఫ్రెండ్లీగా రాజకీయాలు చేయడం మంచిదని ఆయన అనుకుంటున్నారు. ఆ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. నీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ అసలు పోటీ చేయలేకపోవడమే దానికి పరాకాష్ట.
మొత్తంగా నమ్మిన జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలిసి కూడా జగన్ ఏమీ చేయలేరు. అది ఆయన నిస్సహాయత. ఈ సమస్య నుంచి బయటపడటం అంత తేలిక కాదు.త