Carbon Dating: ఈ మధ్య కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లోని ఖగ్గుసరాయ్‌లో పురాతన కట్టడాలు బయటపడ్డాయి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవో కనుగునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) టీం కార్బన్ డేటింగ్ చేపట్టింది. కార్బన్ డేటింగ్ ద్వారా ఓ నిర్మాణ అసలు ఏజ్ తెలుసుకోవచ్చు. ఆ కట్టడం ఎప్పుడు నిర్మించారు. వంటి వివరాలు తెలిసిపోతాయి.
ఏదైనా పురావస్తు వెలుగులోకి వచ్చింది అంటే చాలు కార్బన్ డేటింగ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌లో ఉపయోగించారు. ఈ విధానంలో పరిశీలించిన అధికారులు ఆ కట్టడాన్ని క్రీస్తుపూర్వంలో నిర్మించినట్టు తేల్చారు. అలా మొదలైన ఆ కార్బన్ డేటింగ్ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోడల్‌గా మారిపోయింది.
భారతీయ పురావస్తు శాఖ కూడా కార్బన్ డేటింగ్‌నే ప్రామాణికంగా తీసుకుంది. హరప్పా, మొహెంజొదారో నాగరికత విశేషాలను ఈ విధానంలోనే కనుగొన్నారు. అయోధ్య రామమందిరం వివాదంలో ఇదే కీలకంగా మారింది. ఈ కార్బన్ డేటింగ్ ఆధారంగానే మసీదు కంటే ముందు ఆలయ నిర్మాణం ఉన్నట్లు పురావస్తు శాఖ సర్వే తేల్చింది. అంతకంటే సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కూడా తెలిసింది. రామజన్మ భూమిపై తీర్పు వెలువరిస్తున్న టైంలో పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
అందుకే జ్ఞాన్‌వాపిలో ఈ కార్బన్ డేటింగ్ ప్రక్రియను యూజ్ చేయాలనే డిమాండ్ వచ్చింది. కానీ వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో సుప్రీంకోర్టు దానిని నిషేధించింది. ఇప్పుడు సంభాల్ కేసులో కార్బన్ డేటింగ్ చేపట్టారు.
కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది?
ఒక సంస్కృతి కట్టడం ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి, తవ్వకంలో దొరికిన అవశేషాను పరిశీలిస్తారు. దీన్ని టైమ్ మెషిన్ అని పిలుస్తారు. ఈ కార్బన్ డేటింగ్ పురాతన భవనాలు, కలప, ఎముకలు, కార్బన్ కలిగి ఉన్న అన్ని వస్తువుల వయస్సును కచ్చితంగా అంచనా వేస్తుంది. అన్ని జీవులు, వాటి ఆధారంగా తయారైన వస్తువులు కార్బన్ కలిగి ఉన్నాయనే వాస్తవంపై ఆధారపడి ఈ పద్దతి పని చేస్తుంది. ఈ కార్బన్ ఆధారంగా వాటి వయస్సును లెక్కగడతారు.
మనందరిలో రెండు రకాల కార్బన్ ఉంటుంది. కార్బన్ 12, కార్బన్ 14. ఎవరైనా జీవించి ఉన్నంత వరకు శరీరంలో ఈ రెండు రకాల కార్బన్‌లు సమానంగా ఉంటాయి. కానీ మరణం తర్వాత లేదా ఏదైనా వస్తువు నాశనమైనప్పుడు కార్బన్ 14 కూడా నాశనం అవుతుంది. కార్బన్ 12 ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిపుణులు ఈ కార్బన్‌ను పరిశీలించి ఆ వస్తువు ఎంత పాతదో గుర్తిస్తారు. అంతేకాకుండా కార్బన్ 14 క్షీణించే వేగం ద్వారా సమయాన్ని నిర్ణయించవచ్చు.
ఈ పద్ధతి ఎంత కచ్చితమైంది?
కార్బన్ డేటింగ్ ద్వారా యాభై వేల సంవత్సరాల నాటి వస్తువులకు సరైన లెక్కలు కట్టవచ్చు. ఈ డేటింగ్ టెక్నిక్ చెట్టు చెక్క, కాగితం, ఎముకలు వంటి వాటిపైనే కచ్చితంగా పని చేస్తుంది. మెటల్, రాయి వంటి వాటి గురించి సుమారు అంచనాలను మాత్రమే చెబుతుంది.
కట్టడాలకు కార్బన్ డేటింగ్ ఎలా చేస్తారంటే వాటిపై ఉన్న కీటకాలు లేదా మొక్కలు వంటి సేంద్రీయ వస్తువుల ఆధారంగా వయసు నిర్ణయిస్తారు. కార్బన్ డేటింగ్ మాత్రమే కాకుండా చాలా పద్దతులను పురావస్తు శాఖ యూజ్ చేస్తుంది. రాళ్లు, మట్టి, స్ఫటికాల కాలం చెప్పేందుకు థర్మోలుమినిసెన్స్ డేటింగ్ వాడతారు. చెట్ల వయస్సు, వాటి చుట్టూ జరిగిన పర్యావరణ విషయాలు తెలుసుకునేందుకు డెండ్రోక్రోనాలజీ యూజ్ అవుతుంది. స్ట్రాటిగ్రఫీలో భూమి పొరల అధ్యయనం నుంచి చాలా విషయాలు తెలుస్తాయి.