KCR News Today: 2025 వింటేజ్‌ కేసీఆర్‌ చూడబోతున్నాం! తెలంగాణలో బిగ్ స్కెచ్ వేస్తున్న బీఆర్‌ఎస్‌!

kcr

Telangana News Today: సింహం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది. మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఆకలి వేసిన వెంటేనే లేడికి లేచిందే పరుగు అన్నట్టు దూసుకెళ్లిపోదు. సమయం కోసం ఎదురు చూస్తుంది. తన చేతి ఎర చిక్కే వరకు ఓపికతో ఎదురు చూస్తుంది. రాజకీయ నాయకుడు కూడా అలాంటి వ్యక్తే. రాజకీయాలనే శ్వాస నిశ్వాసగా బతికే నిఖార్సైన రాజకీయ నాయకుడు కూడా తనకు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు సమయం కోసం ఎదురు చూస్తాడు. ఇలానే ఇప్పుడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి కూడా.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు బ్యాడ్‌ టైం నడుస్తుందని గ్రహించిన కేసీఆర్‌ తన శక్తిని వృథా చేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది అవుతున్నప్పటికీ బయటకు వచ్చింది చాలా తక్కువే. లోక్‌సభ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగినా ప్రయోజనం శూన్యం. తర్వాత ఒకట్రెండు సభలు పెట్టినా ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే. తన పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు తన టైం నడుస్తుందో లేదో చెక్ చేసుకుంటున్న కేసీఆర్ జూలు విదిల్చి పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో ఏడాది క్రితం వరకు కేసీఆర్ వేసిన పొలిటికల్ స్కెచ్‌ ఎక్కడా బెడిసి కొట్టలేదు. టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి 2023 వరకు వేసిన ప్రతి వ్యూహం ప్రత్యర్థులను చిత్తు చేసింది. తనకు మంచి చేసింది. కానీ ఉన్నట్టుండి 2023లో అతి విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్‌కు ఎదురుతిరిగాయి. ఇందులో ఆయన పాత్ర ఎంత ఉందో పార్టీ నేతల పాత్ర అంతకు డబుల్ ఉంది. ఇందులో ఎవరి తప్పు ఎంత ఉన్నప్పటికీ కేసీఆర్‌ మాత్రమే మూల్యం చెల్లించుకుంటున్నారు.

2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ మనుగడే ప్రశ్నార్థమైంది. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు జాతీయ పార్టీల విజృంభమలో గులాబీ పార్టీ ఏమవుతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి. ఆ టైంలోనే కుమార్తె కవిత జైలు పాలు కావడం, ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై కేసులు నమోదు కావడంతో పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇదే ఛాన్స్ అనున్న నేతలు కొందరు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఇన్ని జరుగుతున్నా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండటం పార్టీ వర్గాలను మరింత విస్తుపోయేలా చేస్తోంది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేస్తూన్నా హరీష్‌, కేటీఆర్‌ మాత్రమే దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం స్పందించింది లేదు. ఇది కేసీఆర్ తనకు తాను చేస్తున్న రాజకీయ మౌనవ్రతంగా తెలుస్తోంది. త్వరలోనే జూలు విదిల్చి పంజా విసరబోతున్నారని ఆ పంజా దెబ్బకు రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమంటున్నారు.

తెలంగాణపై పట్టు సాధించేందుకు త్వరలోనే వింటేజ్ కేసీఆర్ రాబోతున్నారని టాక్ నడుస్తోంది. తెలంగాణ పునరోద్యమానికి శంఖం పూరించబోతున్నారట. సంక్రాంతి తర్వాత కేసీఆర్ చేసే మహా సంగ్రామంలో ప్రజలంతా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించినట్టుగానే ఇప్పుడు సరికొత్త సెంటిమెంట్ అస్త్రంలో రాబోతున్నారని సమాచారం.

దీక్షాదివస్ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధమని దీక్ష చేయడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ సర్కిల్‌లో పెను సంచలనంగా మారబోతోంది. ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ సెంటిమెంట్‌ కేసీఆర్ పేటెంట్‌. అందుకే ముందుగా బీఆర్‌ఎస్ కీలక నేతలంతా ఈ సెంటిమెంట్‌ రగిల్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ సమస్యపై పోరాటం చేస్తే ప్రజలంతా ఐక్యమవుతారో చూసుకొని ప్రజల్లోకి వస్తే మళ్లీ కేసీఆర్‌కు బ్రహ్మరథం పడతారు. ఆ సిచ్యుయేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముల్కీ నిబంధనల అమలు విషయంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అదే రాను రాను తీవ్రరూపందాల్చి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కారణమైంది. మధ్యలో చాలా అంశాలు దీనికి కారణమయ్యాయి. కానీ ఉద్యమం పుట్టకకు కారణం మాత్రం ఉద్యోగాల వివాదమే. అప్పట్లో ఇది చూడటానికి చిన్న వివాదంగానే కనిపించినా ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు.

బీఆర్‌ఎస్ కూడా పదే పదే తెలంగాణ ఆత్మగౌరవ అస్త్రాన్ని అప్పుడప్పుడూ బయటకు తీస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ప్రజలకు నూరిపోస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపుతూ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను ఉదాహరణలుగా చూపుతున్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ రాజేసే పనిలో ఉన్నారు.

ఇలా సెంటిమెంట్‌ను పరీక్షిస్తూ ప్రజల్లో కేసీఆర్‌ పేరు ఎంత బలంగా ఉందో, టైం ఎలా నడుస్తుందో టెస్టు చేసేందుకు చేపట్టిందే దీక్షా దివస్. ఇది అనుకున్నదాని కంటే బాగా విజయవంతం అయింది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టే కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన రెండో ఇన్నింగ్స్ అదే రోజు ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శల ఫిరంగులు ఎక్కుపెట్టారు. ఆమెతోపాటు కేటీఆర్, హరీష్‌, జగదీష్‌రెడ్డి ఇలా కీలక నేతలతో నిత్యం ప్రజలతో ఉంటూ ఆత్మగౌరవ సెంటిమెంట్‌ను ఎగసిపడేలా చేస్తున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్ పీక్స్‌కు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంట్రీ ఉంటుదట. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ప్రజల్లో ఉంటూ రెండు జాతీయ పార్టీలకు స్కోప్ లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్‌తో ఢీ కొట్టే నేతలు రెండు జాతీయ పార్టీల్లో లేరు. ఇక్కడ వాక్చాతుర్యమే కాకుండా జనాలను తట్టి లేపి ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్న వాళ్లు లేరు. రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఎత్తులు పరిమితంగానే ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్లు బలంగా కనిపించినా ప్రతిపక్షం వెళ్లినంత ఈజీగా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు. దీన్నే కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. ఒక్క దెబ్బకు రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేయబోతున్నారు. సో బీ రెడీ టూ సీ వింటేజ్ కేసీఆర్‌ ఇన్ 2025