కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ – గెలిచింది బీజేపీ – ఢిల్లీలో జరిగింది ఇదే !

కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ - గెలిచింది బీజేపీ - ఢిల్లీలో జరిగింది ఇదే !

Keiriwal:  ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కన్నా..  ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.  పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ.. అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది. కానీ ఈ సారి మాత్రం పదకొండేళ్ల  పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా.. మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ను దూరం చేసుకోవడమే కాదు.. అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని అతిశయోక్తికి పోయి మొదటికే మోసం తెచ్చుకున్నారు. 

ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లు 47 శాతం. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 43 శాతం కన్నా కాస్త ఎక్కువ .  అంటే రెండు పార్టీల మధ్య తేడా మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ తో  ఆప్ కలసి పని చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కలసి రాలేదు. ఆ స్నేహాన్ని కొనసాగించి ఉంటే.. ఓట్ల బదిలీ జరిగి ఉండేది. కేజ్రీవాల్, సిసోడియా వంటి వాళ్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారైనా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు. 

ఢిల్లీలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ తన ఓట్లు శాతానికి మూడు నుంచి నాలుగు శాతం పెంచుకుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్లు కూడా నాలుగు శాతం లోపు వచ్చేవి. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది శాతం వరకూ ఓట్లు వస్తున్నాయి. ఇది కేజ్రీవాల్ ఓటమిని డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు. ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి ఫలితాలను ప్రభావితం చేసింది  కాంగ్రెస్ పార్టీనే.  పార్లమెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని.. ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ కు ఝులక్ ఇచ్చింది. అంతేనా ఇండియా కూటమి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. అంతిమంగా అది కూడా కేజ్రీవాల్ ఓటమికి.. బీజేపీ విజయానికి కారణం అయిందని అనుకోవచ్చు. 

  

కాంగ్రెస్ తో పాటు కేజ్రీవాల్ చేసిన తప్పులు కూడా ఆయనను ఓడించాయి. గత రెండు ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల అభిమానాన్ని ఏకపక్షంగా పొందిన కేజ్రీవాల్ మట్టి కరవక తప్పలేదు  రెండు సార్లు 70 అసెంబ్లీ స్థానాల్లో అరవై స్థానాలకుపైగా కట్టబెట్టారు. అలాంటి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారు. రెండో సారి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో  ఆయన అధికారాన్ని సిసోడియాకు అప్పగించి ఆయన రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు ఆప్ పై క్రమంగా ఆసక్తి కోల్పోయారు.   ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం ఢిల్లీ ప్రజల్ని ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలేం లేదని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఆయనను అరెస్టు చేసినా ప్రజలు స్పందించలేదని.. సానుభూతి వ్యక్తం చేయలేదని ఫలితాల ద్వారా స్పష్టమయింది.  

జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్  పాలనపై దృష్టి పెట్టలేదు. అరెస్టు అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అతిశీ ద్వారా పాలన సాగించారు. కానీ విడుదలైన తర్వాత సానుభూతి రాజకీయాల కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ప్రజల్లో సానుభూతి కోల్పోయారు.  రాజకీయ కారణాలతో  అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వెళ్లారు. ఢిల్లీలో పాలన జరగకపోవడానికి కారణం  అయ్యారు.  మొదటి విడతలో అద్భుతమైన పాలన చూపించిన కేజ్రీవాల్.. రెండో విడతకు వచ్చే సరికి కేంద్రంతో  గొడవలు పడి.. పనులు జరగకుండా చేసుకున్నారు. ఫలితంగా ఆప్ మార్క్ మిస్ అయిపోయింది. స్కూల్స్ బాగు చేయించామని.. మొహల్లా క్లీనిక్ లు పెట్టామని మొదటి విడత లో చేసిన పనులనే ఇప్పుడూ ప్రచారం చేసుకున్నారు కానీ.. గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. ఫలితంగా కేజ్రీవాల్ కు ప్రజలు ఇంటి దారి చూపించారు. 

తరవాత కథనం