Manmohan Singh : భారత్ ను ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా .. అంతకన్నా ముందు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్‌ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ దే. ఆ తర్వాత ప్రస్తుత ప్రధానిగా ఉన్న మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. భారతదేశ ప్రధానిగా పదవి చేపట్టిన తొలి సిక్కు నేత మన్మోహన్ సింగ్,. ఇందిరాగాంధీ మరణం తర్వాత 1984లో జరిగిన అల్లర్లలో 3 వేల మంది సిక్కుల మరణానికి సంబంధించి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో బహిరంగ క్షమాపణ చెప్పారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వంపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి…దీంతో 2014లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది.
1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు మన్మోహన్ సింగ్ . అప్పట్లో ఈ ప్రాంతానికి మంచి నీరు, విద్యుత్‌లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. మన్మోహన్ సింగ్ – గురుశరణ్ కౌర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ చేశారు. కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారని ఆయన కుమార్తె దమన్ సింగ్ తన తల్లిదండ్రుల గురించి రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. స్కాలర్ షిప్ మినహా మిగిలిన డబ్బుకోసం తండ్రిపై ఆధారపడ్డారు..ఆ సమయంలో రాయితీతో లభించే భోజనం చేసేవారని ఆ పుస్తకంలో ఉంది.
1991లో కేంద్ర ఆర్థికమంత్రి అయ్యాక రాజకీయంగా మన్మోహన్ సింగ్ ప్రతిష్ఠ పెరిగింది. అనూహ్యంగా వచ్చిన ఈ పదవి చాలా కాలం ఆయన్ను రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. సివిల్ సర్వెంట్‌గా, ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పని చేశారు. రిజర్వ్ బ్యాంక్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దేశంలో తిరుగులేని ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి బాటలు వేశారు. పన్నులు తగ్గించారు..రూపాయి విలువ పెంచారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.
దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. 1990ల్లో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది.
1999లో లోక్‌సభకు పోటీచేసి ఆయన ఓడిపోవడంతో కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపింది. 2004లోనూ ఇలాగే జరిగింది. ఆ ఏడాది ఆయన మొదటిసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. తన ఇటలీ మూలాల విషయంలో పార్టీపై విమర్శలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానిగా మన్మోహన్ ని ప్రతిపాదించారు. పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించింది మాత్రం సోనియానే అనే విమర్శలున్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న తొలి ఐదేళ్లలో అతిపెద్ద విజయం అంటే అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడమే.
అపారజ్ఞానం, అంకితభావంతో పనిచేయడంతో మన్మోహన్ సింగ్ ఎంతో గౌరవం సంపాదించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సాధించినన్ని విజయాలు, ప్రధానిగా మన్మోహన్ సాధించలేకపోయారని కొందరు విమర్శలు చేశారు. రెండోసారి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయ్.. ఈ టైమ్ లో మన్మోహన్ ఎక్కువకాలం వార్తల్లో నిలిచారు. ఈ సమయంలో విధానాల పరంగా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించి.. తిరోగమనం బాటలో సాగింది. భారత్ లో అతి బలహీనమైన ప్రధాని మన్మోహన్ అని బీజీపీ సీనియర్ నేత అడ్వాణీ విమర్శించారు. అయితే తానుమాత్రం ప్రజా సంక్షేమం కోసం పనిచేశానన్నారు.
విద్యావంతుడిగా, మేధావిగా, ప్రజా సేవకుడిగా మంచి పేరున్నప్పటికీ ఆయన ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండేవారు. ట్వీట్లు, పోస్టులు పెట్టే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా తక్కువే. తక్కువగా మాట్లాడటం, ప్రశాంతమైన ప్రవర్తనలాంటివి కూడా ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టాయి.
ఆయన ఇంకా ముందే రాజకీయాల నుంచి వైదొలిగితే బావుండేదని కొంతమంది చరిత్రకారులు వ్యాఖ్యానించినప్పటికీ… దేశాన్ని అణు వివక్ష నుంచి బయటపడేసినందుకు , ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినందుకు మన్మోహన్‌సింగ్‌ను చరిత్ర మర్చిపోదు..
” మీడియా, ప్రతిపక్షాలు నన్ను ఎలా విమర్శించినా చరిత్ర నాపట్ల దయతో వ్యవహరిస్తుందని నమ్ముతున్నా” అని ఓ ఇంటర్యూలో చెప్పారు మన్మోహన్ సింగ్
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!