సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు సమ్మర్ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో రెండు, మూడు అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చిన్నారులు గాయాల పాలయ్యారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గాయపడిన చిన్నారుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఉన్నారు. తన కుమారుడు ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని పవన్ కళ్యాణ్ తాజాగా మీడియాతో చెప్పారు.
తన కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని.. పొగ ఎక్కువగా పీల్చడంతో వైద్యులు టెస్టులు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. తన కుమారుడు పొగ ఎక్కువగా పీల్చడంతో వైద్యులు బ్రాంకోస్కోపీ చేస్తున్నారని అన్నారు. కాగా పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు నాడే ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని బాధపడ్డారు.
అయితే తనకు మొదట ఫోన్ వచ్చినప్పుడు అది చిన్న ప్రమాదమే అని అనుకున్నానని.. ఆ తర్వాత దాని తీవ్రత తెలిసి ఎంతో ఆందోళన పడ్డానని చెప్పారు. ఇక ఈ ప్రమాదం జరిగింది అని తెలిసి ఎంతోమంది అవసరమైన సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ రాత్రి సింగపూర్ బయలుదేరి వెళుతున్నానని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు క్షేమంగా ఉండాలని ఆయన అభిమానులు, జనసైనికులు ప్రార్థనలు చేస్తున్నారు.