Mohanbabiu TV9 Issue: మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లి ఆయన మూతి దగ్గర మైక్ పెట్టిన జర్నలిస్టును మోహన్ బాబు వారి మైక్ తీసుకుని వారి బుర్ర బద్దలు కొట్టినంత పని చేశారు. మనిషివా..మోహన్ బాబువా అని ప్రశ్నిస్తూ సదరు టీవీ చానల్ గగ్గోలు పెడుతోంది. జర్నలిస్టు సంఘాల పేరుతో ప్రదర్శనలు నిర్వహించింది. కానీ సామాన్య జనం ఒక్క శాతం అయినా సపోర్టు వచ్చిందా? అంటే అసలు లేదని చెప్పుకోవాలి. మోహన్ బాబుకే మొత్తం సపోర్టు లభించింది. ఆయన మంచి పని చేశారని అంటున్నారు. మోహన్ బాబును తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఈ విషయంలో మంచి పని చేశారని ఆయనను ప్రశంసిస్తున్నారు. సాధారణంగా దాడికి గురైన వారికి సానుభూతిరావాలి. ఇక్కడ దాడి చేసిన వారికి సానుభూతి వస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ?
మీడియా అంటే విచ్చలవిడిగా వ్యవహరించే స్వేచ్ఛ ఉన్నట్లు కాదు !
మీడియా అంటే తమకు అన్ని అధికారాలు ఉన్నాయని ప్రతినిధులు అనుకుంటూ ఉంటారు.కానీ ప్రైవేటు ఆస్తుల్లోకి దీసుకెళ్లడం.. వ్యక్తిగత వివాదాలను హైలెట్ చేయడం.. కుటుంబ గొడవల్ని బిగ్ బాస్ షోల్లాగా ప్రసారం చేయడం మీడియా స్వేచ్ఛ కాదు.వారు సెలబ్రిటీలు అయినప్పటికీ వారి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇంట్లోకి ట్రెస్ పాసింగ్ చేసి మరీ ..ఆయన మూతి దగ్గర మైక్ పెట్టాల్సిన అవసరం ఏమిటి అన్నది అందరూ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. మోహన్ బాబు కూడా తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి అదే చెప్పారు. ఆయన క్షమాపణలు చెబుతూ లేఖ రాసి ఉండవచ్చు కానీ ఆయన అభిప్రాయం మాత్రం టీవీ చానల్ తమ కుటుంబ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడమే కాదు..తన ఇంట్లోకి దూసుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి ఎవరి వద్దా సమాధానం లేదు.
మొత్తం అంతే.. అందుకే ప్రజల్లో దొరకని సానుభూతి
నిజానికి ఒక్క మోహన్ బాబు విషయంలోనే ఇలా జరిగి ఉంటే ప్రజలు కూడా దాడిని ఖండించేవారు.కానీ మీడియా ఇదే మొదటి సారి కాదు..ఇదే చివరి సారి కాదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఆయా మీడియా సంస్థలు చేసే అతితో ప్రజల్లో విరక్తి వచ్చేసింది. తాము ఏం చెప్పినా నమ్ముతారన్న ఉద్దేశంతో నెంబర్ వన్ టీవీ చానల్ చేసిన అతిని చూసి ప్రజలు ఎప్పుడో వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ టీవీ చానల్ పై దాడి చేసి.. అందర్నీ కొట్టేసి వచ్చినా.. సమర్థించేవారు సగానికిపైగా ఉంటారంటే.. ఎంత వ్యతిరేకత పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల మద్దతు దక్కకపోవడంపై మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
పోటీ ప్రపంచంలో నిలబడాలంటే.. వ్యూస్, రెవిన్యూ పెరగాలంటే ఇలా చేయకతప్పదని.. జనం చూసేవే తాము చూపిస్తామని వాదిస్తూ ఉంటారు. అందులో నిజం ఉంది.అందు కోసం నైతిక విలువల్ని పక్కన పెట్టేస్తారా ?. కుటుంబాల్లోకి చొచ్చుకు వెళ్తారా ?. ఓ లైన్ పెట్టుకుని దాన్ని దాటకుండా రేసులో పాల్గొని.. ఫలితాలు చూపించుకోవాలి కానీ తమ బాగు కోసం ఇతర జీవితాలతో ఆడుకుంటామనే విధానం సరి కాదు. ఇప్పుడు మోహన్ బాబుకు వచ్చిన సానుభూతి ఈ సారి ఇతర సెలబ్రిటీలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియాపైనే ఉంది. ఆత్మ విమర్శ చేసుకుని మీడియా తన గౌరవాన్ని తాను కాపాడుకోవాలి.