Allu Arjun: రాజకీయ నేతల పేర్లు కూడా సరిగ్గా గుర్తు ఉండని అల్లు అర్జున్ చుట్టూ పేరుకుపోయిన రాజీకయం వైల్డ్ ఫైర్ గా మారింది. ఇప్పుడు ఆ వైల్డ్ ఫైర్ ఆయన చుట్టూ పేరుకుపోయింది. ఫలితంగా ఆయన నలిగిపోతున్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా ఉంటున్నట్లుగా నటిస్తూ రేవంత్ ను టార్గెట్ చేస్తున్న రాజకీయం వల్లే పుష్పకు సమస్యలు వచ్చాయి. ఏపీలో వైసీపీ.. తెలంగాణో బీఆర్ఎస్ అదే పని చేస్తున్నాయి. దీంతో ఆ సమస్య అంతకంతూ పెరిగిపోతోంది కానీ తగ్గడం లేదు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎటాక్ చేసేంత వరకూ వ్యవహారం వెళ్లిందంటే దానికి కారణం.. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలే.
అర్జున్ ఇష్యూను అంతకంతకూ పెద్దది చేసిన కేటీఆర్
సంధ్యధియేటర్‌లో జరిగిన తొక్కిసలాట విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ స్టార్ట్ అయింది.. ఎక్కడికి వెళ్తోంది.. దీనికి ఎవరు కారణం అనేది ఆలోచిస్తే.. అల్లు అర్జున్ క్యాంపునకు అసలు విషయం అర్థం అవుతుంది. అత్యధిక సినిమా టిక్కెట్ రేట్లకు అనుమతి ఇచ్చారు. అర్థరాత్రి ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. ఇంత సహకరించిన సినిమా విషయంలో రేవంత్ కు వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ చేసిన ఓ పొరపాటు కారణంగా ఇప్పుడు రేవంత్ వ్యతిరేకమయ్యారు. దానితో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. పదే పదే అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ ను కార్నర్ చేయడానికి అల్లు అర్జున్ కు మద్దతిచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ ట్రాప్ ను అల్లు అర్జున్ టీం అర్థం చేసుకోలేకపోయింది.
మరింతగా వాడుకున్న వైసీపీ
ఈ ఇష్యూలో వైసీపీ కూడా కావాల్సినంత రాజకీయం చేసింది. అరెస్ట్ వెనుక ఏపీ రాజకీయాలను కూడా తెచ్చారు. చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. మద్దతుగా రాజకీయ పార్టీలు రంగంలోకి వచ్చి సోషల్ మీడియా సైన్యాలను రంగంలోకి దింపడంతో చేయిదాటిపోయింది. ఎవరు సలహా ఇచ్చారో.. ఎందుకు ఇచ్చారో కానీ లాన్ లో ఓదార్పు ప్రోగ్రాం లైవ్ పెట్టడంతో ఇక టాపిక్ ను ఎవరూ ఆపలేరని అర్థమైపోయింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్ వైరల్ అయిపోయింది. వైల్డ్ ఫైర్ గా మారింది. అర్జున్ అరెస్టును రెండు రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ గెయిన్స్ కోసం వాడుకున్నాయి. దీన్ని అల్లు అర్జున్ టీం గుర్తించిందో లేదో తెలియదు. ఆయన ఇప్పుడు వైల్డ్ ఫైర్ మధ్యలో ఉన్నారు. సెగ ఆయనకే తగులుతోంది.
రాజకీయాల్ని డీల్ చేయడంలో అర్జున్ విఫలం
రాజకీయాల్ని డీల్ చేయడంలో అర్జున్ విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది. తన కుటుంబం అంతాపవన్ కోసం పిఠాపురం వెళ్లినప్పుడు నాకు ఫ్రెండే ముఖ్యం అని నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడే ఆయన అతి పెద్ద తప్పిదం చేశారు. స్నేహంలో రాజకీయం కలపడంతో ఇక ఆయన రాజకీయం అయిపోయారు. దాన్ని వైసీపీ, ఇప్పుడు బీఆర్ఎస్ వాడేసుకుంటున్నాయి. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చాక ఎక్కడికో పోవాల్సిన ఆయన .. ఈ రాజకీయాల ట్రాప్ లో ఇరుక్కుపోయారు. వైల్డ్ ఫైర్ లో ఎలాంటి గాయాలతో బయటపడతారో కానీ.. ఎంతో కొంత నష్టం జరగకుండా బయటపడటం అసాధ్యం అనుకోవచ్చు.