Sharmila is the future leader of YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా మూడేళ్ల కిందట ఓ ప్లీనరిలో జగన్ ప్రకటింప చేసుకున్నారు. తర్వాత ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తూచ్.. అలాంటిదేమీ లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ?. ఇటీవల ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న నగదు గురించి వివరాలు ఇచ్చాయి. అందులో వైసీపీ తమ వద్ద కేవలం రూ. 27 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. అంతకు రెండేళ్ల ముందు ఈ మొత్తం రూ. ఐదు వందల కోట్ల వరకూ ఉండేది. ఆ సొమ్ము అంతా ఏమయింది ?. ఈ రెండింటికి సంబంధం లేదు కానీ.. సంబంధం ఉంది. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎప్పటికైనా తన చేతుల్లోనుంచి జారి పోతుందన్న నమ్మకంతో ఉండటమే.
జగన్‌లో నాయకత్వ లక్షణాలు శూన్యం
రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికైనా జగన్‌లో కనీస మాత్ర నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎవరూ అనుకోరు. చిన్నపిల్లల తరహాలో కక్షలు తీర్చుకోవడం.. ప్రత్యర్థుల్ని బూతులు తిట్టించడం.. చచ్చిపోయిన వాళ్లపైనా పగతో రగిలిపోవడం ఏమిటో ఆ పార్టీ నేతలకూ అర్థం కాదు. పార్టీ క్యాడర్ ను అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పోని ఏదైనా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుందా అంటే అదీ ఉండదు. పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చింది చదవడం మాత్రమే వచ్చు. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏకతాటిపైన ఉంచితే జగన్ఆ కుటుంబాన్ని ఎన్ని ముక్కలు చేసేశారో కళ్ల ముందే ఉంది. కుటుంబాన్నే సమైక్యంగా ఉంచలేకపోయారు.. కాపాడుకోలేకపోయారు ఇక పార్టీని కాపాడుకునేంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎవరూ అనుకోరు.. అనుకోలేరు కూడా.
పార్టీ తన దగ్గర ఉండదని జగన్‌కూ నమ్మకం !
ఎవరో ఒకరు.. ఎప్పుడో ఓ సారి తన పార్టీని లాగేసుకుంటారని జగన్ కు గట్టి నమ్మకం ఉంది. అందుకే ఆయన ఓ సారి తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింప చేసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటిది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. కానీ జగన్ మనస్థత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే పార్టీ ఓడిపోగానే.. పార్టీ ఖాతాలో డబ్బులన్నీ తరలించేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల తరహాలో తనకు మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీల్ని లాగేసుకుని పార్టీని కూడా వారితే అంటే అప్పుడుఖాతాల్లో డబ్బులు కూడా పోతాయని ఆయన ముందుగా వాటిని తరలించేసుకున్నారు. ఇంత అభద్రతా భావం ఉండే జగన్‌లో రాజకీయం చేసే లక్షణాలు ఉన్నాయని.. పార్టీని కాపాడుకుంటారని ఆయన సన్నిహితులకూ నమ్మకం లేకుండా పోతోంది.
జగన్ తెలివి తక్కువతనంతో ఆడుకుంటున్న షర్మిల !
వైఎస్ రాజకీయవారసుడిగా జగన్ వచ్చారు. కుటుంబం అంతా ఆమోదించింది. షర్మిలకు ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు. కానీ జగన్ చేసిన నిర్వాకం వల్ల షర్మిల కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజకీయ తెలివితేటలు మొత్తం షర్మిలకే వచ్చాయి కానీ..జగన్ రెడ్డికి ఒక్క శాతం కూడా రాలేదని ఇప్పుడు వారుచేస్తున్న రాజకీయాల్ని చూస్తే అర్థమవుతుంది. షర్మిల అత్యంత వ్యూహాత్మకంగా తెలివితో రాజకీయం చేస్తూంటే జగన్ రెడ్డి చిల్లర కోసం తల్లి, చెల్లిపై కోర్టులకు కూడా వెళ్లి మొత్తం విలువ పోగొట్టుకుంటున్నారు. అసలు ఆయనకు ఏ విలువలూ లేవని ప్రజల ముందు నిలబెడుతున్నారు షర్మిల, అంతకు మించి జగన్ ఆయువు పట్టులాంటి మైనార్టీలు, దళితులను మెల్లగా కాంగ్రెస్ వైపు లాక్కుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు అదే ఆందోళనతో ఉన్నారు.
జగన్ కేసులు – జైళ్లు – తర్వాత షర్మిల చేతికి వైసీపీ!
ఇప్పుడు ఇలా ఉంది సరే.. రెండేళ్ల తర్వాత ఎలా ఉంటుంది?. ఒక్క సారి ఆలోచిస్తే జగన్ కేసుల్లో చురుకుదనం వచ్చి ఆయన జైలుకెళ్లడానికి దగ్గర పడతారు. అంతే కాదు బోలెడన్ని కొత్త కేసులు వస్తాయి. ఆర్థికంగా దిగ్బంధంలో ఉంటారు. చివరికి జైలుకెళ్తారు. అప్పుడు వైసీపీ ఎవరి చేతుల్లో ఉంటుంది?. జగన్ భార్య భారతి చేతుల్లో ఉండే అవకాశమే లేదు . పార్టీ నేతలు, క్యాడర్ ఆమెను అంగీకరించరు. షర్మిలను పార్టీని క్యాప్చర్ చేసుకోవాలని కోరుతారు. అలాంటి సిట్యూయేషన్ కోసమే షర్మిల ఎదురు చూస్తూంటారు. ఆమె ఎందుకు వదులుకుంటారు?