Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ-2025కు భారీగా భక్తులు వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు తరలి రావడంతో ప్రయాగ్ రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. మొదటి రోజే 3.5 కోట్ల మంది భక్తులు మొదటి అమృత్ స్నానంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. అలాంటి వారిలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా ఉన్నారు.
ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో స్టీవ్ జాబ్స్ భార్య పాల్గొనడం కాదు… యాభై ఏళ్ల క్రితం కుంభమేళాపై స్టీవ్‌జాబ్స్ తన స్నేహితుడికి ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ వేలంలో రూ.4.32 కోట్లకు అమ్ముడుపోయింది. 1974లో కుంభమేళా గురించి జాబ్స్ ఆ లేఖ రాశారు. తన 19వ పుట్టినరోజుకు ముందు స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు రాసిన ఆ లెటర్‌లో భారతదేశం, ఆధ్యాత్మికతపై స్టీవ్ జాబ్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన భావాలను, భారత్‌లో జరగబోయే కుంభమేళాకు హాజరయ్యేందుకు ఆసక్తిని వివరించారు.
స్టీవ్ జాబ్స్ రాసిన 50 ఏళ్ల నాటి ఈ లేఖను వేలం వేయగా ఔత్సాహికులు భారీగా పోటీ పడ్డారు. స్టీవ్ జాబ్స్ రాసిన తొలి లేఖ ఇదే కావడంతో ఒక బిడ్డర్ ఈ లేఖను అత్యధికంగా $500,312.50 అంటే రూ. 4.32 కోట్లకు సొంతం చేసుకున్నారు.
ఇంతకీ ఆ లేఖలో స్టీవ్ జాబ్స్ ఏమి రాశారంటే
ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ ఇలా రాసుకొచ్చారు.”నేను ఏప్రిల్‌లో భారతదేశంలో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను, నేను మార్చి నెలలో ఎప్పుడైనా వస్తాను, అయితే, అది ఇంకా కచ్చితంగా తెలియదు. ‘శాంతి’ అనే పదంతో తన లేఖను ముగించారు. ఈ లేఖ ఆయన కు హిందూ మతం పట్ల ఉన్న ధోరణిని తెలియజేస్తుంది. ఇందులో భారతదేశానికి పర్యటనతోపాటు, సంస్కృతి, బోధనల గురించి కూడా రాశారు.
స్టీవ్ జాబ్స్ 1974 లో భారతదేశానికి వచ్చారు. మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. కైంచి ధామ్‌లో ఉన్నారు. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ భారతదేశంలో 7 నెలలు గడిపారు. భారతీయ సంస్కృతిని దగ్గరగా చూసి అర్థం చేసుకున్నారు.
యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025లో పాల్గొన్నారు. లారెన్ పావెల్ జాబ్స్ తన భర్త మాటల నుంచి పొంది ఉండవచ్చు. లారెన్, తన ఆధ్యాత్మిక మార్గదర్శి స్వామి కైలాశానంద గిరిచే ‘కమలా’ అని పిలుస్తారు, ఆమె 40 మంది సభ్యుల బృందంతో ధ్యానం, యోగా , ప్రాణాయామం చేస్తారు.
స్వామి కైలాసానంద గిరి ఎవరు?
మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి నిరంజనీ అఖారా పీఠాధీశ్వరుడు. ఏ దేశంలోనైనా ప్రధానమంత్రి కంటే పై స్థాయిోల రాష్ట్రపతి ఉన్నట్టే సాధువుల్లో కూడా ఇలాంటి హైరార్కీ ఉంటుంది. సాధువుల్లో శంకరాచార్యులకు అత్యున్నత స్థానం ఉంటుంది. ఆయన తర్వాత మొత్తం 13 అఖారాలకు వారి స్వంత ఆచార్య మహామండలేశ్వరుడు ఉన్నారు. స్వామి కైలాసానంద 2021 సంవత్సరంలో నిరంజని అఖారా ఆచార్య మహామండలేశ్వర్ అయ్యారు. దీనికి ముందు ఆయన అగ్ని అఖారా ఆచార్య మహామండలేశ్వరుడు.
స్వామి కైలాసానంద గిరి 1976లో బీహార్‌లోని జముయిలో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలోనే ఇల్లు వదిలి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. భగవంతుని సేవలో ఉండిపోయారు.
స్వామి కైలాసానంద ప్రస్తుతం హరిద్వార్‌లోని కాళీ ఆలయానికి అధిపతిగా ఉన్నారు. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్, రాపర్ హనీ సింగ్, సురేశ్ రెయిన్, రిషబ్ పంత్, కంగనా రనౌత్ వంటి పలువురు పెద్ద కళాకారులు, రాజకీయ నాయకులు స్వామి కైలాసానంద గిరి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా స్వామి కైలాశానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. స్వామి కైలాశానంద తన గోత్రాన్ని ఇవ్వడం ద్వారా లారెన్‌కు కొత్త దిశను చూపించారు. ఆమెకు ‘కమలా’ అనే కొత్త పేరు కూడా పెట్టారు.