సునీతా విలియమ్స్‌ ఎన్నిరోజులు అంతరిక్షంలో ఉన్నారు? జీతం ఎంత వస్తుంది? ఆరోగ్యం ఏమవుతుంది?

sunita williams

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌ను మరికొన్ని గంటల్లో భూమిపైకి తిరిగిరానున్నారు.వారిని తీసుకొచ్చందుకు స్పేస్ ఎక్స్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తో టీం ఘన స్వాగతం పలికారు. 9 నెలలుగా అంతరిక్ష వాసం కొన్ని గంటల్లో ముగిసిపోనుంది. అయితే అంతకంటే ముందు అక్కడి బాధ్యతలను కొత్త టీంకు అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అయితే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాతావరణం అనుకూలిస్తే తిరుగుపయనం మొదలవుతుంది. మార్చి 19, 20 తేదీల్లో సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ భూమిపైకి రానున్నారు.

2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల వల్ల వచ్చే ప్రక్రియ ఆలస్యమైంది. అంతరిక్షనౌకను నడిపించే అయిదు థ్రస్ట్‌లు పనిచేయకపోవడం, హీలియం అయిపోవడంతో ఆపరేషన్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా ఈ స్టార్‌లైనర్‌ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ పనితీరు పరిశీలిన కోసం సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను పంపారు.

స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ను తిరిగి తీసుకురావడం ప్రమాదమని గత ఆగస్టులో తేల్చారు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఖాళీగానే బోయింగ్ స్టార్ లైనర్ గత ఏడాది సెప్టెంబర్ 7నతిరిగి వచ్చేసింది. ఇంతలో అమెరికాలో ప్రభుత్వం మారడంతో ఆ ఇద్దర్ని కిందికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ బాధ్యతను ఎలాన్‌ మస్క్‌కు అప్పగించారు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌.

కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండియన్ అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌. 1965లో అమెరికాలోని ఓహియోలో సునీతా విలియమ్స్‌ జన్మించారు. 1958లో అహ్మదాబాద్‌కు చెందిన ఆమె పేరెంట్స్‌ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా అమెరికా వెళ్లిపోయారు. సునీత భర్త మైఖేల్ విలియమ్స్. ఆయన ప్రస్తుతం ఒక పోలీస్ అధికారిగా పని చేస్తున్నారు. సునీత 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.

సునీత జీతం ఎంత?

అమెరికా ప్రభుత్వ గ్రేడ్ పే పౌర వ్యోమగాములు జీఎస్-13, జీఎస్-15 కింద వస్తారు. జీఎస్-15 అనేది ఫైనల్‌ గ్రేడ్‌ ఎక్కువ జీతాలు ఇస్తారు. ప్రస్తుతం ఇదే గ్రేడ్‌లో సునీతా విలియమ్స్‌కు జీతం ఇస్తున్నారు. ఏడాదికి రూ. 98 లక్షలు నుంచి రూ. 1.27 కోట్లు వరకు ఉంటుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్లి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్‌ రాకెట్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉపయోగించింది పదకొండో మిషన్. మార్చి 16 తేదీ నుంచి 19 మధ్యలో భూమిపైకి వచ్చేలా షెడ్యుల్ చేశారు. దీనికి నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్ పైలట్‌. సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ను భూమిపైకి తీసుకురానున్నారు. నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీతా కొత్త రికార్డు సృష్టించనున్నారు.

సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల అస్ట్రోనాట్స్ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాలు, ఎముకల సాంద్రతపై ఎఫెక్ట్ పడుతుంది. ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేలా తయారవుతాయి. కాల్షియం వంటి మినరల్స్‌ పడిపోతాయి. చాలా కాలం తర్వాత భూమికి తిరిగి వస్తున్నందున వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

సునీతా విలియమ్స్ 9నెలలకుపైగా ఐఎస్ఎస్‌లోనే ఉన్నందున అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు సృష్టిచారు. 2006-07లో తన మొదటి స్పేస్‌వాక్ సమయంలో కూడా అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాలపాటు గడిపి ఎక్కువ సేపు స్పేస్‌వాక్ చేసిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఆస్ట్రోనాట్ క్యాథరిన్ థార్న్‌టన్ పేరిట ఉంది. ఆమె 21 గంటలకుపైగా స్పేస్‌వాక్ చేశారు. సునీతాకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. మొత్తం తొమ్మిదిసార్లు అంతరిక్షంలో నడిచారు. ఈసారి సునీత 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. విల్‌మోర్ రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు.

తరవాత కథనం