Revanth Comments On Allu Arjun Arrest: దేశ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేశారా? అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy

Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి… అల్లు అర్జున్ అరెస్టుపై అడిగిన ప్రశ్నలకు స్పందించారు. గతంలో కూడా చాలా మంది సినీ స్టార్స్‌, సెలబ్రెటీలు అరెస్టు అయ్యారని గుర్తు చేశారు.

ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంటే దేశంలో రాజ్యాంగం ముందు సామాన్యుల నుంచి ప్రధానమంత్రి వరకు అంతా ఒక్కటే అనే అర్థమని తెలిపారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు కూడా అంతే అన్నారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

పుష్ప 2 సినిమా బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్‌ ధరను కూడా 1300 వరకు పెంచుకునేందుకు వీలు కల్పించారమని రేవంత్ చెప్పారు. జనం కిక్కిరిసిన థియేటర్‌కు అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం లేకుండా వచ్చారని తెలిపారు. అందుకేే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.

థియేటర్ వద్ద జరగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని రేవంత్ వివరించారు. ప్రస్తుతం ఆమె కుమారుడు కోమాలో ఉన్నాడని చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. అందుకే పోలీసులు కేసులు నమోదు చేశారని అందులో థియేటర్ యాజమాన్నంతోపాటు అల్లు అర్జున్‌ను బాధ్యులను చేశారన్నారు.

కేసుల నమోదు అయిన పది రోజుల తర్వాత అల్లు అర్జున్ ను పోలీసుల అరెస్టు చేశారని వివరించారు. ఆయన ఇంటికి పోలీసులు వెళ్లినప్పుడు స్వయంగా అల్లు అర్జునే పోలీసులతో కలిసి వచ్చారని కోర్టుకు వెళ్లారని తెలిపారు. ఆయనకు కోర్టు బెయిల్ కూడా ఇచ్చిందని పేర్కొన్నారు.

ప్రజలు ప్రాణాలు పోయిన కేసులు పెట్టలేదంటే నటుల కోసం ప్రత్యేక రాజ్యాంగం, చట్టం ఉందా అని ప్రశ్నిస్తారని మీడియాను ఉద్దేశించి రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో అక్కడ నేరం జరిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నారు. అంతే తప్ప ఆయన స్టారా.. పొలిటికల్ స్టారా అన్నది ముఖ్యం కాదని తేల్చి చెప్పారు.

అల్లు అర్జున్ కార్‌లో వచ్చి సినిమా చూసి వెళ్లిపోలేదన్న రేవంత్…. కారు పైకి ఎక్కి చేతులూపుతూ అక్కడి జనాన్ని ఉత్సాహపరిచారని వివరించారు. అప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు. అందుకే ఆయన్ని ఏ1 చేయలేదని… ఏ 11 చేశామని గుర్తు చేశారు. మహిళ ప్రాణాలు పోయాయి. ఇందుకు బాధ్యులెవరు అని ప్రస్నించారు. ఇప్పటికీ ఆ 9 ఏళ్ల పిల్లాడు ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్ప 2 అనేద అల్లు అర్జున్ సొంత సినిమా అని దాన్ని ఓ స్టూడియోలో కానీ వేరే చోట స్పెషల్ షో కూడా వేసుకోవచ్చన్నారు. ఇంట్లో కూడా చూసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. కానీ జనాల్లోకి వెళ్లి సినిమా చూడాలంటే పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చి ఏర్పాట్లు చేసి ఉండాల్సిందన్నారు.

అల్లు అర్జున్‌ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మామ చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీ నేత అని పేర్కొన్నారు. ఆయనకు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకే చెందిన నేత అని అన్నారు. ఆయన తనకు బంధువు అని వెల్లడించారు. అల్లు అర్జున్ భార్య తనకు బంధువే అవుతుందన్నారు. బంధుత్వంతోనే, పరిచయంతో పని కాదని… పోలీసుల పని. వారి పని వారు చేసుకున్నారన్నారు.

హోం శాఖ తన చేతిలోనే ఉందని, రిపోర్టు అడుగుతూనే ఉంటానన్నారు. ఈ ఘటనపై కూడా రిపోర్ట్ తీసుకున్నట్టు తెలిపారు. రేవంత్. అల్లు అర్జున్ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే అది నిజం కాదన్నారు. అలా ఎవరైనా అనుమతి లేకుండా నిరసన తెలిపితే జైలుకు పోతారని హెచ్చరించారు. ఒక మనిషిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తే ఇంత చర్చ ఎందుకని ప్రశ్నించారు. కానీ ఒక మహిళ చనిపోయింది. ఆమె గురించి ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదన్నారు. ఆమె కొడుకు పరిస్థితి ఏంటని వాకబు చేయడం లేదని వాపోయారు.

సినిమా నటులకు ఇదొక వ్యాపారమన్న రేవంత్… డబ్బులు పెట్టారు. సినిమా తీశారు. సంపాదించుకున్నారన్నారు. వీళ్లేమైనా దేశం కోసం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేసి విజయాలు సాధించి పెట్టారా? అని సంచలన కామెంట్స్ చేశారు. తన ఫేవరేట్ హీరో కృష్ణ అని రేవంత్‌.. తానే ఒక స్టార్ అని అన్నారు. తన కోసం ఫ్యాన్స్ ఉంటారని… తాను ఎవరికీ ఫ్యాన్ కాదన్నారు.

తరవాత కథనం