ఒక రోజు తగినంత నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కళ్లు మూతలుపడుతుంటాయి. మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఓ కునుకు తీయాలనిపిస్తోంది. అలాంటిది రోజులు కాదు, వారాలు కాదు నెలలు అంతకంటే కాదు ఏకంగా ఏళ్ల తరబడి నిద్రలేకుండా ఉండే వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎక్కడో విదేశాల్లో కాదు మనదేశంలోనే అలాంటి వింత మనుషులు ఉన్నారు వాళ్ల జీవనాన్ని ఓ సారి చూద్దాం.
కొందరికి లైట్ఉంటే నిద్రపట్టదు. మరికొందరికి శబ్దాలు వినిపిస్తే నిద్రరాదు. ఇంకొదరికి గంటా రెండు గంటల కంటే నిద్ర రాదు. మరికొందరు పడుకుంటే వాళ్లను లేపడానికి తలప్రాణం తోకకు వస్తుంది. అలాంటి వారిని కుంభకర్ణుడి నిద్ర అంటారు. ఇలాంటి వారందర్నీ మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే మనుషులు తీరే సపరేటు. వీళ్లు నిద్రపోయి సంవత్సరాలు దాటింది.
ఒకరోజు నిద్రపోకుంటేనే తల బరువుగా అనిపిస్తుంటుంది. కళ్లు ఎర్రబడతాయి. మరికొందరికి తలనొప్పి వచ్చేస్తుంది. ఇలా నిద్ర తక్కువైన వాళ్లు పడే బాధలు మీరు రోజూ చూస్తునే ఉంటారు. మీరు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేసే వాళ్ల లెక్క వేరు. వీళ్లకు నిద్రపట్టకపోవడం అనేది జబ్బు కాదు. వాళ్లు కొన్నేళ్లుగా చేస్తున్న ప్రాక్టీసు. అయితే నిద్రపోని కారణంగా వచ్చే వ్యాధులు కూడా వారికి లేవని వైద్యులు చెబుతున్నారు. మరి ఎలా జీవిస్తున్నారంటే… ఆ వైద్యులకే తెలియాలి.
వియత్నామ్‌కు చెందిన 49 ఏళ్ల గుయెన్ ఎన్ గక్ మై కిమ్ 30 ఏళ్లుగా నిద్రపోలేదట. నిద్రలేమి కారణంగా ఆమెకు ఎలాంటి వ్యాధులు లేవు. కొన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం ద్వారా అలా నిద్రలేకుండా జీవించడం అలవాటైపోయిందంటారామె. ఈమె పేరు కూడా మర్చిపోయిన స్థానికులు నిద్రపోని మహిళా టైలర్గానే గుర్తు పెట్టుకున్నారట.
రోజూ రాత్రి పొద్దుపోయే వరకు చదవడం ఇష్టం. ఆమెకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి బట్టలు కుట్టడానికి రాత్రి ఆలస్యంగా నిద్రలేచేది. అలా కొన్ని రోజులు నిద్రపోకుండా పని చేయడం శరీరానికి అలవాటు చేసింది. అలా రోజులు కాస్త వారాలు, వారాలు కాస్త నెలలు, నెలలు కాస్తా సంవత్సరాలు అయ్యాయి. దీంతో ఆమె శరీరం, కళ్లు నిద్రపోకుండా సర్దుకుపోయాయని చెప్పారు.
చైనాకు చెందిన జ్యానింగ్ అనే మహిళ కూడా ౩౦ ఏళ్ల నుంచి నిద్రలేకుండా జీవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు నలభై ఏళ్లు దాటింది. చిన్నప్పుడు తప్ప బుద్ధి వచ్చిన తర్వాత ఏనాడూ ఆ మహిళ నిద్ర పోలేదట. ఆమెకు వివాహం జరిగి దాదాపు 30 సంవత్సరాలు అవుతోంది. నిద్రపోవడం లేదని ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. ప్రయోజనం లేకుండాపోయింది. తమకు అర్థం కావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు.
ఇలాంటి వ్యక్తి విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా ఉన్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి యాబై ఏళ్ల నుంచి నిద్రపోకుండానే హాయిగా జీవిస్తున్నాడు. అతడే మోహన్ లాల్ ద్వివేది. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఈయన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. వాళ్ల తండ్రి, తాత కూడా రోజుకు రెండు, మూడు గంటలకు మించి నిద్రపోయేవారు కాదు. మోహన్ లాల్ కూడా మొదట్లో రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. 23 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పూర్తిగా నిద్ర పట్టడం మానేసింది.
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే భయంతో కుటుంబ సభ్యులు అతడిని ముంబై, ఢిల్లీలోని వైద్యులకు కూడా చూపించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలూ చేసి, మందులు వాడించి ఫలితం లేకపోవడంతో చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు, వైద్యులు భయపడినట్టు మోహన్ లాల్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదు. ఆయన అందరిలాగానే ఆరోగ్యంగా ఉన్నారు. కనీసం కళ్లు ఎర్రగా మారడం, మండినట్టు అనిపించడం కూడా ఉండదని మోహన్ చెబుతున్నారు.
ఇదండీ వీళ్ల వరస. వీళ్లకు ఎంత ఖరీదైన మంచాలపై పడుకోబెట్టినా, ఎన్ని నిద్రమాత్రలు ఇచ్చినా నిద్రరావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది జన్యుపరమైన సమస్యగా వైద్యులు చెబుతున్నారు. ఇది వీళ్ల ప్రత్యేకమని.. ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రతీ మనిషికి కంటినిండా నిద్ర ఉండాల్సిదేనంటున్నారు.