మోహన్‌బాబు కుటుంబంలో చిచ్చు పెట్టింది రాజకీయ నేత – ఎవరా లీడర్ ?

మోహన్‌బాబు కుటుంబంలో చిచ్చు పెట్టింది రాజకీయ నేత - ఎవరా లీడర్ ?

Manchu Politics: మంచు మోహన్ బాబు కుటుంబం రోడ్డున పడటానికి ఓ లీడర్ కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ లీడర్ ఎవరో తనకు తెలుసని మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో ఉంది. అయితే మంచు కుటుంబానికి రాజకీయానికి దగ్గర సంబంధం ఉంది. నేరుగా మోహన్ బాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఓ సారి వైసీపీలో చేరి ప్రచారం చేసినా తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరు అధికారంలో ఉంటే వారికి దగ్గరగా మోహన్ బాబు ఉంటారు. ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టాలని ప్రత్యేకంగా ఎవరూ ప్రయత్నించరు. కానీ మోహన్ బాబు మాత్రం తన కుటుంబంలో చిచ్చుకు రాజకీయం కారణం అని ఆరోపిస్తున్నారు.

భూమా మౌనిక ఫ్యామిలీ అంతా రాజకీయమే !

మంచు మనోజ్ వెనుక రాజకీయ నేత ఉన్నారంటే అది ఖచ్చితంగా భూమా మౌనిక వైపు నుంచి అనుకోవచ్చు. మనోజ్ విషయంలో వెనకున్న ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఆయన కోడలు భూమా మౌనిక సోదరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ప్రత్యేకంగా ఎవరో ఉండాల్సిన పని లేదు. తన సోదరికి అన్యాయం జరిగితే ఆమె తప్పక స్పందిస్తారు. ఆమె జోక్యంతోనే ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో కలతలు వచ్చాయని చెప్పలేం కానీ.. ఆ రాజకీయం మాత్రం వారి వద్ద ఉందని అనుకోవచ్చు.

మంచు ఫ్యామిలీ వెనుక జగన్

మరి విష్ణు వెనుక ఎవరూ లేరా అంటే.. జగన్ ఫ్యామిలీ ఉందని అందరికీ తెలుసు. మోహన్ బాబు కారణం ఏదైనా కానీ కుటుంబాన్ని రాజకీయాలతో కలిపేసుకున్నారు. మొదట విష్ణు పెళ్లి ద్వారా ఇష్టపూర్వకంగా వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం కలిగితే.. తర్వాత మనోజ్ ద్వారా అయిష్టంగా అయినా భూమా ఫ్యామిలీతో బంధుత్వం కలిసింది. అంటే ఇద్దరు కుమారులకు రాజకీయ నేపధ్యం ఉన్న భార్యలు ఉన్నారు. ఇక వారి జీవితాల్లోకి రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి?. మోహన్ బాబు దురదృష్టం ఏమో కానీ.. ఇద్దరు కోడళ్ల రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంది కాబట్టి సమస్యలు పెరిగిపోయాయి.

అనుబంధాలు గట్టిగా ఉంటే రాజకీయం ఏం చేస్తుంది ?

మనోజ్ వెనుక ఎవరో రాజకీయ నాయకుడు ఉన్నారని.. వాళ్లు మోటివేట్ చేస్తున్నారని మోహన్ బాబు నిందిస్తే అది ఆయన తప్పిదం అవుతుంది. సొంత కుమారుడు తన మాట వినకుండా ఎవరో రాజకీయనాయకుడి మాటలు ఎందుకు వింటున్నాడో ఆలోచించాల్సి ఉంది. కారణం ఏదైనా మోహన్ బాబు కుటుంబంలో రాజకీయ చిచ్చు అనేది ఉంటే అది ఖచ్చితంగా ఆయన పెట్టుకున్నదే అనుకోవచ్చు. ఈ విషయంలో రాజకీయాల్ని ఇతరుల్ని నిందించడం కన్నా.. ముందు తమ కుటుంబంలో వ్యవహారాలను సరి చేసుకోవడం మోహన్ బాబుకు చాలా మంచిదని అనుకోవచ్చు.

మంచు ఫ్యామిలీ రాజకీయాలు ఆపేసి చర్చలు జరుపుకోవడం బెటర్ !

తమ కుటుంబంలో ఏర్పడిన సమస్యలకు రాజకీయాలను కారణంగా చెప్పడం ద్వారా మోహన్ బాబు సాధించేదేమీ ఉండదు.  ముందుగా ఆయన తన కుటుంబంతో రాజకీయం చేయడం ఆపేసి..  అందరితో కూర్చుని మాట్లాడుకుని కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

తరవాత కథనం