IndiGo Flight: ఇండిగో విమానంలో దోపిడీ? అసలు ఏం జరిగింది.. ఆ మహిళ ఏం చెప్పింది?

Image Credit: Pixabay

బస్సు.. రైళ్లలో దోపిడీ గురించి వినే ఉంటాం. కానీ, ఈ విమానం దోపిడీ ఏంటీ చిత్రంగా అని అనుకుంటున్నారా? అసలు దొంగలు విమానంలోకి ఎలా వచ్చారనేగా సందేహం? ఇదిగో ఏం జరిగిందో చూడండి.

ఇండిగో విమానంలో తన తల్లి దోపిడీకి గురైందని షీసేస్ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ త్రిషా శెట్టి ఆరోపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (twitter) ద్వారా తన తల్లికి ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది. విమానంలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేయడానికి కూడా సిబ్బంది సహకరించలేదని ఆమె పేర్కొంది.

అసలు ఏం జరిగింది?

విమానంలో ప్రయాణిస్తూ తన తల్లి నిద్రలోకి జారుకుందని, ఇదే అదనుగా భావించిన ఓ ప్రయాణికుడు ఓవర్ హెడ్‌(క్యాబిన్ బ్యాగేజ్)లో ఉంచిన ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకున్నాడని తెలిపింది. అతడు ఆ బ్యాగ్గును తిరిగి ఓవర్ హెడ్‌లో పెడుతున్న సమయంలో లక్కీ ఆమె తల్లి కళ్లు తెరిచి చూసిందట. దీనిపై ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయితే, వారు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారట.

తోటి ప్రయాణికుల సాయంతో..

విమాన సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించారని ఆమె తెలిపింది. దాని వల్ల పోయిన వస్తువులను ఆమె తిరిగి పొందగలిగిందని పేర్కొంది. ఈ విషయంలో తన తల్లికి సహకరించిన తోటి ప్రయాణికులకు ధన్యవాదాలు అంటూ ఆమె ఎక్స్‌లో రాసుకొచ్చింది. అయితే, కేవలం తల్లి మాత్రమే కాదని, ఇతర ప్రయాణికులు కూడా ఆ దొంగ గురించి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో విమాన సిబ్బంది చాలా దారుణంగా స్పందించారని ఆమె తెలిపింది.

స్పందించిన ఇండిగో సంస్థ

ఈ విషయంపై ఇండిగో విమానయాన సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలని పేర్కొంది. విమానంలో ఆమె తల్లి క్యాబిన్ బ్యాగేజీని తీసేందుకు ప్రయత్నించిన తెలిసిన వెంటనే తమ సిబ్బందిని ప్రశ్నించామని తెలిపింది. ఏమైనా వస్తువులు పోయాయేమో చూడాలని ఆమె తల్లిని తమ సిబ్బంది అడిగారని, ఏ వస్తువులు పోలేదని ఆమె మాకు చెప్పారని ఇండిగో వెల్లడించింది.

ఫిర్యాదుకు తిరస్కరించారు

ఈ విషయంపై ఆమె ఎప్పుడైనా సరే అధికారికంగా కంప్లైట్ చేయొచ్చని, ఇందుకు ఆమె వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉంటుందని తమ సిబ్బంది తెలిపారని ఇండియో పేర్కొంది. అయితే, ఆ సమయంలో ఆమెకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉండటం వల్ల ఫిర్యాదు ఇచ్చేందుకు నిరాకరించారని, ఆమె నిర్ణయాన్ని తమ సిబ్బంది గౌరవించారని తెలిపింది. ‘‘కస్టమర్స్‌కు సహకరించేందుకు అవసరమైతే.. మా భద్రతా సిబ్బంది కూడా విమానం వద్ద అందుబాటులో ఉంటారు. మా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందివ్వడమే మా బాధ్యత’’ అని పేర్కొంది. అయితే, శర్మ ఈ విషయాన్ని ఇంతటితో ఆపలేదు. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించింది. ఆమె పోస్టుపై స్పందించిన విమాన ప్రయాణికులు.. అయితే, మనం ఇక రైళ్లు, బస్సుల్లోనే కాదు.. విమానాల్లో కూడా దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

తరవాత కథనం