Yaganti Nandi: యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం.. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమని చెబుతారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన వింత ఏంటంటే..నంది ఏటా పెరుగుతూ ఉంటుంది. దీనివెనుకున్న మిస్టరీ ఏంటంటే..
వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా అగస్త్యమహర్షి నల్లమలకు వచ్చి తపస్సు ఆచరించారు. అనంతరం ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చెక్కుతున్న విగ్రహానికి బొటనవేలు విరిగింది. ఇలా జరిగితే కీడు తప్పదనుకున్నారు..తాను చేసిన తప్పేంటో తెలుసుకునేందు తపస్సు ఆచరించాడు అగస్త్యుడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఈ ప్రాంతం కైలాశాన్ని పోలిఉందని తాను ఇక్కడ కొలువై ఉంటానని చెప్పి ఉమామహేశ్వరస్వామిగా వెలిశాడు. దీంతో తాను చెక్కిన వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అగస్త్యుడు ఆలయం పక్కనే ఉన్న కొండగుడలో పెట్టి పూజలందించాడు. ఉమామహేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించిన కొన్ని రోజులకు నంది వెలిసినట్టు స్థలపురాణం.
బొటనవేలు లేని వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంచిన గుహ పక్కనే మరో గుహ కనిపిస్తుంది..అది శివ గుహ. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేశారని చెబుతారు. 5వ శతాబ్దం నుంచి చోళులు, పల్లవులు, చాణుక్యులు ఇక్కడ నిత్యం పూజలు చేసేవారు. 15వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్తుడైన హరిహర బుక్కరాయలు ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు.
ఈ ఆలయంలో నంది విగ్రహం పెరగడంపై ఎన్నో రీసెర్చ్ లు చేశారు. 400 ఏళ్ల క్రితం చిన్నగా ఉండే విగ్రహం ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. అయితే నంది అప్పట్లో వెలిసినప్పటి ఫొటోలు, ఆధారాలు లేకపోవడంతో ఇదంతా ప్రచారమే అనేవారూ ఉన్నారు. కానీ నంది పరిమాణం పెరగడం వాస్తవమే అంటారు. ఏడాదికి మిల్లీ మీటర్ చొప్పున పెరుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఆలయంలో నందిచుట్టూ ఉండే స్తంభాలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. యూరప్ రొమేనియాలో రాళ్లు పెరుగుతాయంట.. అవి పిల్లలు కూడా పెడతాయ్…వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. వాటిలో జీవం ఉందనుకోవద్దు..ఇదో రసాయన ప్రక్రియ అంటారు శాస్త్రవేత్తలు. యాగంటి నంది కూడా అంతే అంటన్నారు. అయితే రొమేనియాలో రాళ్లు పెరగాలంటే వానలు పడాలి. వేసవిలో సాధారణ పరిమాణంలో ఉండి..వర్షాకాలంలో రాళ్లు పెరుగుతుంటాయ్. ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్ వల్ల ఈ చర్య జరుగుతుందని తేలింది.
రొమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్లు యాగంటి విగ్రహంలోనూ ఉన్నాయి కానీ..ఇది ఆలయంలో ఉంటుంది వానలో తడవదు..మరి ఎలా పెరుగుతోందన్నది మిస్టరీనే. నందులన్నీ పెరిగితే సరేకానీ..మిగిలిన శివాలయాల్లో ఉండే నందులు పెరగవు కదా..ఇదెలా సాధ్యం అవుతోందన్నది చిక్కువీడని ప్రశ్నే.
కలియుగాంతానికి ఈ నందికి లింక్ పెట్టారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ నంది లేచి రంకె వేస్తే యుగాంతమే అని కాలజ్ఞానంలో పేర్కొన్నారు.
ఈ ఆలయం సమీపంలో కాకులు కనిపించవు..వేంకటేశ్వరస్వామి విగ్రహం బొటన వేలు విరగిన తర్వాత తపస్సు చేసిన అగస్త్యుడికి కాకులు తపోభంగం చేశాయ్. అందుకే ఈ ప్రాంతంలో కాకులు కనిపించకూడదని శాపం ఇచ్చారు అగస్త్యుడు. అయితే కాకులు నిషేధించిన ప్రాంతంలో తాను ఉండనని శనిదేవుడు వెళ్లిపోయాడట. అందుకే ఇక్కడ శివాలయంలో నవగ్రహాలు ఉండవు. యాగంటిలో మరో ప్రత్యేకత ఏంటంటే..ఏడాది పొడవునా కోనేట్లో నీరుంటుంది.
Note: పుస్తకాల్లో పేర్కొన్నవి, పండితుల నుంచి తెలుసుకున్న వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!