వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ – వాళ్లకు నష్టం జరిగినా రాజకీయంగా వాడేసుకుంటున్నారు !

వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌

YSRCP:   అల్లు అర్జున్‌కు వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో పాటు ఆ పార్టీ నాయకులు ఇస్తున్న మద్దతు  ఆయనకు ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అవుతోంది. అల్లు అర్జున్ తమ వాడేనని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గతంలో ఎన్టీఆర్ ను ఎలా ఉపయోగించుకున్నారో అలానే ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకూ జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తెచ్చేవారు. ఇప్పుడు అర్జున్ ను తీసుకు వస్తున్నారు. వైసీపీ ఉద్దేశం ఎన్టీఆర్ విషయంలో టీడీపీని..  అర్జున్ విషయంలో జనసేనను ఇబ్బందిపెట్టాలనే.  కానీ ఆ నటుల జీవితాన్ని దెబ్బకొడుతున్నారన్న విషయం గుర్తించడం లేదు. 

స్టార్ హీరోల జీవితాలతో  వైసీపీ రాజకీయ ఆటలు

రాజకీయాల్లో తమకు పది ఓట్లు కలసి వస్తాయన్నాలేకపోతే వేరే పార్టీకి లాస్ అవుతామన్నా చాలు ఆ విషయాన్ని  తమ పార్టీ కోసం వాడేసుకోవడం. వైసీపీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో  జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఎలా వాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ర్యాలీల్లో ఓ పది మంది వైసీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు పట్టుకొస్తారు. వెంటనే టీవీ చానళ్లలో  బ్రేకింగులు వేస్తాయి. చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా..  ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు అని. ఆ పది మంది వైసీపీ కార్యకర్తలే. ఇక ఫ్లెక్సీలు గురించి చెప్పాల్సిన పని లేదు. వేరే హీరో పోస్టర్ ను వాడుకోవడం పరువు తక్కువ అనే భావన వారికి రాదు. వాడేసుకుంటున్నారు.   ఎన్టీఆర్ ఫోటో వాడి ఎన్ని ఫ్లెక్సీలు కట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో వైసీపీని అసోసియేట్ చేసుకున్నారు.  హీరో స్పందిస్తే మరింత రచ్చ చేయవచ్చని అనుకున్నారు. 

ఇప్పుడు అల్లు అర్జున్ ను వైసీపీ నేతగాప్రచారం

ఇప్పుడు వైసీపీ నేతలంతా ఎన్టీఆర్ ప్రస్తావన మర్చిపోయారు.  అల్లు అర్జున్ మీద పడ్డారు. జగన్ పుట్టిన రోజు జరుపుకుంటే.. ఆయన ఒక్కడికి ఫ్లెక్సీలు పెట్టడం అవసరమా అన్నట్లుగా అల్లు అర్జున్ ను కలుపుకున్నారు. ఇప్పుడు వివాదంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  ఇలా చేయడం అల్లు అర్జున్ ను మరింతగా ఇబ్బంది పెట్టడం అవుతుందని రాజకీయ జోక్యం వద్దని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ రాజకీయం ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని అందరూ ఖండించాలని అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అందరికీ ట్యాక్స్ చేశారు కానీ జగన్ కు మాత్రం ట్యాగ్ చేయలేదు. ఇలాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. 

స్పందించలేని నిస్సహాయత ఆ హీరోలది !

ఆ హీరోలది స్పందించలేని నిస్సహాయత. తమ విషయంలో మీ జోక్యం వద్దని వారు ప్రకటిస్తే.. ఇక రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయినట్లే అవుతుంది. ప్రకటించకపోతే టేకిట్ గ్రాంటెడ్ అన్నట్లుగా కథ నడిపిస్తూ ఉంటారు.  ఫ్యాన్స్ కూడా ఇలాంటి వారి ట్రాప్ లో ఫ్యాన్స్ పడితే తమ హీరోలకు అన్యాయం చేసినట్లే కానీ…. అభిమానించినట్లు కాదు. అందుకే అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఓ నోట్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఎవరూ ఫ్యాన్స్ పేరుతో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదన్నారు.కానీ ఈ రాజకీయం మాత్రం మారదు. 

తరవాత కథనం