MS Dhoni New Record: ధోనీ వింటేజ్ ప్రదర్శన- 11 ఏళ్ల రికార్డు బ్రేక్‌

MS Dhoni

MS Dhoni New Record: ఏప్రిల్ 14, 2025న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మాస్టర్ క్లాస్‌ ఆటతో ఆకట్టుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2014లో ప్రవీణ్ తంబే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు నాయకత్వం వహించిన ధోనీ 11 బంతుల్లో 26 పరుగులు చేసి, స్టంప్స్ వెనుక మూడు అవుట్‌లు చేయడంతో CSK లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. ఐదు వరుస మ్యాచ్‌ల పరాజయాలకు బ్రేక్ వేసింది. T20 ఫార్మాట్‌లో ధోనీ ప్రతిభను పునరుద్ఘాటించింది. కెప్టెన్‌గా అతని 17వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఈ విభాగంలో IPLలో అత్యంత టాప్‌లో ఉన్న కెప్టెన్‌గా తన రికార్డును మరింత పటిష్టం చేసుకున్నాడు.

CSK కి ఒక మలుపు
IPL 2025 లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన CSK ఒత్తిడిలో ఉంది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 63 పరుగులతో నిర్ణీత 20 ఓవర్లలో ఎల్‌ఎస్జీ 166/7 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే మొదట్లో విజయం దిశగా దూసుకెళ్లినా చివర్లో తడబడింది. జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 111 పరుగులు ఉన్నటైంలో 7వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కి వచ్చాడు. శివమ్ దూబే (27 బంతుల్లో 43*) తో కలిసి, ధోని 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే CSKని గెలిపించాడు.అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. పేస్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడి తన ట్రేడ్‌మార్క్ ఆటను ప్రదర్శించాడు.

ప్రవీణ్ తంబే రికార్డును బద్దలు కొట్టాడు
ధోనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చారిత్రాత్మకమైనది. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 సంవత్సరాల 208 రోజుల వయసులో ప్రవీణ్ తంబే మ్యాన్‌ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఇప్పుడు 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు తీసుకున్న ధోనీ 11 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున లెగ్ స్పిన్నర్ అయిన తంబే తన చివరి దశలో వండర్‌ఫుల్ బౌలింగ్ చేశాడు. అతనికి బౌలింగ్ విభాగంలో అవార్డు వస్తే ధోనీకి ఆల్ రౌండ్ విభాగంలో అవార్డు వచ్చింది. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్‌గా జట్టును నడిపించినందుకు అవార్డు వరించింది. స్టంప్స్ వెనుకాలా అద్భుతమైన మూడు క్యాచ్‌లు పట్టి LSG పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. ఒత్తిడిలో కూడా మంచి బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. 2019 తర్వాత ధోనీకి ఇది మొదటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. 2175 రోజుల విరామం తర్వాత ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా పక్కన పడటంతో, ధోనీ CSK జట్టును నడిపించడానికి ముందుకు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఎలా దాడి చేయాలి, ఎగ్రెసివ్‌ ఫీల్డింగ్ వ్యూహాలు కనిపించాయి. రవీంద్ర జడేజా 2/24, నూర్ అహ్మద్ 4/13 అద్భుత బౌలింగ్‌తో LSGని కంట్రోల్ చేశాడు. పతిరానా పేస్ (2/45)ని ఉపయోగించి భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోనీ బ్యాటింగ్ యూనిట్ మెరుగుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. “బౌలింగ్ యూనిట్‌గా మేము బాగా ఆడాం. బ్యాటింగ్ యూనిట్‌గా మేము మరింత బాగా ఆడగలం” అని అన్నాడు

బ్యాటింగ్ మాస్టర్‌క్లాస్
ధోనీ 11 బంతుల్లో 26* పరుగులు చేయడం అతని T20 ప్రతిభకు అద్దం పడుతుంది. LSG సీమర్లు అవేష్ ఖాన్, యష్ ఠాకూర్ లను ఎదుర్కొంటూ ఫోర్లు బాదాడు.డీప్ స్క్వేర్-లెగ్ పై వన్ హ్యాండ్ సిక్స్ మతిపోయేలా చేసింది. IPL 2024 నుంచి పేస్ కు వ్యతిరేకంగా ధోని స్ట్రైక్ రేట్ 222గా ఉంది. స్టంప్స్‌ వెనకాల కూడా అద్భుతం చేశాడు. మొత్తం ఐపీల్‌లో ఇప్పటి వరకు 154 క్యాచ్‌లు పట్టాడు. 45 స్టంపింగ్‌లు చేశాడు. ధోని ఇప్పటి వరకు 271 IPL మ్యాచ్‌లు ఆడి, 39.22 సగటుతో 5,373 పరుగులు చేశాడు, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని ఐదు ఐపీఎల్ టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023) సాధించాడు.

తరవాత కథనం