ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క ఉండబోతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్ లో అడుగుపెట్టాయి. రెండు చాలా బలంగానే ఉన్నాయి. ఈ రెండు జట్లకు టోర్నీలో ఓటమే లేదు.
దీంతో భారత్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో రెండు మ్యాచ్లు గెలుపొందిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ తో కూడా గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా గ్రూప్‌లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇలా జరిగితే గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ భారత ఓడితే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
ఇక న్యూజిలాండ్ కూడా బలమైన జట్టు. కావున టీమిండియా అన్నింటికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా దుబాయ్ లోని మందకోడి పిచ్ పై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. కివీస్ జట్టులో ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఉన్నారు. మరి ఇవాళ మ్యాచ్ లో వీరిని టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక భారత్ కూడా స్పిన్ విభాగంలో బలంగానే ఉంది. అక్షర పటేల్, జడేజా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
అయితే ఇక్కడ టీమిండియా క్రికెట్ అభిమానులకు ఒక న్యూస్ నిరాశపరచింది. ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ, షమీ, కుల్దీప్ యాదవ్ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తొడ కండరాల నొప్పితో రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు కివిస్ తో మ్యాచ్ కు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతడి స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అలాగే షమీ కూడా పిక్క నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అతడి స్థానంలో అర్షదీప్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.