ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లకు సొంత గడ్డపైనే లక్నో బ్యాటర్లు చుక్కలు చూపించారు. నికోలస్ పురన్, మిచెల్ మార్స్ చెలరేగిపోయారు. సిక్సర్లు మోత మోగించి హాఫ్ సెంచరీలు సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. లక్నో జట్టులో పూరన్ దుమ్ము దులిపేశాడు. కేవలం 36 బంతుల్లో 87 పరుగులతో అబ్బురపరిచాడు. అందులో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అలాగే మిచెల్ మార్స్ అదరగొట్టేసాడు. అతడు 48 బంతుల్లో 81 పరుగులు రాబట్టాడు. అందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్స్ లు ఉన్నాయి. ఓపెనర్ మార్ క్రమ్ కూడా చెండాడేసాడు. 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. ఈ ముగ్గురు చెలరేగడంతో లక్నో జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది.
లక్నో నిర్దేశించిన పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్కతా జట్టు చేతులెత్తేసింది. ఆఖరి వరకు పోరాడి మ్యాచ్ ను చేజార్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి విజయానికి నాలుగు అడుగుల దూరంలో ఆగిపోయింది. మొదట్నుంచి మంచి ఫామ్ కనబరుస్తూ వచ్చిన కోల్కతా జట్టు మధ్యలో తడబడింది.
సునీల్ నరేన్ 13 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. అలాగే కెప్టెన్ రెహనా 35 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. వీరు ముగ్గురు తప్పించి మిగతా ఎవరు ఎక్కువ స్కోర్ చేయకపోవడంతో కోల్కతా జట్టు ఓటమి పాలయింది. ఆఖరి వరకు ఉన్న రింకు సింగ్ ఫోర్లు, సిక్సర్లు బాదిన ఫలితం లేకపోయింది. కేవలం నాలుగు పరుగులు తేడాతో కేకేఆర్ జట్టు ఓడిపోయింది.